HOLI 2024: జీవితం వర్ణమయం | Sakshi
Sakshi News home page

HOLI 2024: జీవితం వర్ణమయం

Published Mon, Mar 25 2024 4:41 AM

HOLI 2024: The process of embracing the changes in the nature - Sakshi

మంచిమాట

మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు.

చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది.

గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం.

హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు.
అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు.

శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట.

ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే...
మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం.  అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు.

హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి.

మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ  అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది.

మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే  మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం.
     
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement
Advertisement