కుండలు చేసే ఊరు | Sakshi
Sakshi News home page

కుండలు చేసే ఊరు

Published Tue, Apr 2 2024 12:32 AM

Pottery Making at Manamadurai in Tamil Nadu - Sakshi

ప్రతి ఊరిలో కుండలు చేస్తారు. కాని కుండలు చేయడానికి మాత్రమే ఒక ఊరు ప్రసిద్ధం అయ్యింది.అదే తమిళనాడులోని ‘మనమదురై’.అక్కడ పారే వైగై నది తెచ్చే ఒండ్రు మట్టితో తయారయ్యే ఈ కుండలు చల్లదనానికి ప్రతీకలు. స్త్రీలు ఈ కుండల తయారీలో సరి సమాన శ్రమ చేస్తారు. ఘటాలు కూడా తయారు చేస్తారు. ఈ కుండల ప్రత్యేకత వల్ల వీటికి ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌’ (జిఐ) ట్యాగ్‌ దక్కింది.

వేసవి రాగానే కుండలు గుర్తుకొస్తాయి. ప్రతి ఇంటిలో కుండలోని చల్లటి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని నీళ్లలో ఉండే కృత్రిమ చల్లదనం కుండ నీళ్లలో ఉండదు. అందుకే కొత్త కుండలు వేసవిలో ప్రతి ఇంటికి చేరుతాయి. చలివేంద్రాలు పెట్టేవారు పెద్ద పెద్ద కుండలు కొని దాహార్తి తీర్చి పుణ్యం కట్టుకుంటారు. పక్షులకు నీరు పెట్టాలనుకునేవారు మట్టి పాత్రల్లో నీళ్లు నింపి పెడతారు. ఒకప్పుడు పల్లెల్లో పాలకుండ, పెరుగు కుండ, నెయ్యి కుండ ఉండేవి. పెరుగు కుండలో తోడు పెడితే చాలా రుచి. స్టీలు, ప్లాస్టిక్‌ దెబ్బకు కుండలు కొన్నాళ్లు వెనుకబడినా మళ్లీ ఇప్పుడు ఆరోగ్యస్పృహ వల్ల పుంజుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక కుండలకు గిరాకీ తగ్గలేదు. వాటిలో మనమదురై కుండలు మరీ ప్రత్యేకం.

కుండల ఊరు
తమిళనాడులోని శివగంగ జిల్లాలోని చిన్న ఊరు మనమదురై. యాభై వేల జనాభా ఉంటుంది. ఇది మదురై నుంచి 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ పారే వైగై నది ఈ ఊరికి ఇచ్చిన అనుకోని వరం కుండలు తయారు చేయడానికి అవసరమైన ఒండ్రుమట్టి. నది ఒడ్డు నుంచి తెచ్చుకున్న ఒండ్రుమట్టి కాల్షియం లైమ్, బూడిద, సోడియం సిలికేట్, మాంగనీస్, ఐరన్‌ మిశ్రమాలను కలిపి కుండలు తయారు చేస్తారు. మనమదురై కుండను గుర్తించడం ఎలా అంటే దాని అడుగు పరిపూర్ణమైన గుండ్రంగా ఉంటుంది. అదే సమయంలో నేల మీద సరిగ్గా కూచుంటుంది. ఈ కుండల తయారీలో పంచభూతాలు ఉంటాయి అంటారు ఈ ఊరి వాళ్లు. నేల, నీరు, అగ్ని తయారీలో ఉపయోగిస్తే మట్టిలోని సూక్ష్మరంధ్రాలు గాలి రాకపోకలను సూచిస్తాయి. కుండ లోపలి ఖాళీ (శూన్యం) ఆకాశాన్ని సూచిస్తుంది. వేసవి కోసం ఇక్కడ విశేష సంఖ్యలు కుండలను స్త్రీ, పురుషులు కలిసి తయారు చేస్తారు. కుటుంబాలన్నీ కుండల మీదే ఆధారపడి బతుకుతాయి. వీటికి ఎంత డిమాండ్‌ ఉన్నా దూర్రపాంతాలకు పంపడం ఖర్చుతో, రిస్క్‌తో కూడుకున్న పని. కుండలు పగిలిపోతాయి. అందుకే స్థానికంగా తప్ప ఇవి ఎక్కువగా దొరకవు.

ఘటం ఎలా తయారు చేస్తారు?
మనమదురై కుండలకే కాదు ఘటాలకు కూడా ప్రసిద్ధి. నీరు పోస్తే కుండ. సంగీతం పలికిస్తే ఘటం. కాని అది సంగీతం పలికించాలంటే కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలి. మనమదురై ఘటాలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీనాక్షి కేశవన్‌ అనే మహిళ ఘటాలు తయారు చేయడంలో ఖ్యాతి ΄÷ందింది. పెద్ద పెద్ద విద్వాంసులు ఆమె తయారు చేసిన ఘటాలనే వాయించేవారు. ఘటం తయారు చేయాలంటే కుమ్మరి చక్రంపై కుండ తయారయ్యాక ఒక రోజు ఉంచేస్తారు. మర్నాడు దానిని ప్రత్యేక చెక్కమెత్తతో మెత్తుతారు. ఒక పచ్చికుండ కాల్చడానికి ముందు ఘటంగా మారాలంటే ఆ కుండలోని ప్రతి అంగుళాన్ని మెత్తాలి. అలా 3000 సార్లు మెత్తి ఆ తర్వాత కాల్చుతారు. అప్పుడే ఘటం తయారవుతుంది. ఇది ఓపికతో కూడిన పని కాబట్టి స్త్రీలు ఎక్కువగా చేస్తారు. వీటి కోసం వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కొనుక్కెళ్లేవారు ఉన్నారు. కుండలు చేసే కుటుంబాలు ఉన్నా ఘటాలు చేసే కుటుంబాలు అంతరించి పోతున్నాయని ఇటీవల సాంస్కృతిక, సంగీత అభిమానులు క్రౌడ్‌ ఫండింగ్‌ చేసి ఘటాల తయారీని పునరుద్ధరించేలా చూశారు.

Advertisement
Advertisement