సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్‌ సర్దారా? | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్‌ సర్దారా?

Published Wed, Jan 10 2024 11:38 AM

Precautions to be taken before going to the festival of Sankranti - Sakshi

బస్సెక్కి వెళ్లాలా? కారెక్కి వెళ్లాలా? ఏ రోజు వెళ్లాలి.. ఎప్పుడు రావాలి... సెలవు అడగాలా వద్దా? డబ్బులు సమకూరాయా లేదా? సంక్రాంతి వచ్చేసింది. కొందరు మాత్రం చివరి వరకూ ఏ విషయం తేల్చకుండా హడావిడిగా ప్రయాణం పెట్టుకుని ట్రబుల్స్‌లో పడతారు. వద్దు. సంక్రాంతికి ఊరెళ్లేందుకు హాయిగాప్లాన్‌ చేసుకోండి. సంతోషంగా పండక్కు పదండి.

పండగని తెలుసు. వెళ్లాలనీ తెలుసు. కాని ఏదీ తెమల్దు. నెలా రెండు నెలల ముందు భార్యాభర్తలు కూచుని మాట్లాడుకుని కచ్చితంగా ఫలానా డేట్‌కు బయలుదేరి వెళ్దాం అనుకుని ఉంటే ట్రైన్‌ టికెట్లు ఉంటాయి. తత్కాల్‌లో చూసుకోవచ్చులే అనుకుంటారు. బస్సులు దొరుకుతాయిలే అనుకుంటారు. అంతగాకుంటే కారుంది కదా పోదాం అనుకుంటారు. అనుకోవడం ఎందుకు? ఖరారు చేసుకోకపోవడం ఎందుకు? చివరి నిమిషంలో హైరానా పడటం ఎందుకు?

ఎప్పుడు? ఎక్కడకు?
సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయినవారితో కలిసి చేసుకుంటే సంతోషాన్ని పెంచే పండగ. అయితే ఈ అయిన వారు ఎవరు అనేది ఒక్కోసారి స్పష్టత రాదు. భార్యకు పుట్టింటికి వెళ్లాలని ఉండొచ్చు. భర్తకు తన సొంతూరికి వెళ్లాలని ఉండొచ్చు. ఈ పండక్కు ఈ ఊరు... మరో పండక్కి ఆ ఊరు అని టక్కున నిశ్చయించుకుంటే సగం చింత ఉండదు. కాని తేల్చరు. మరికొన్ని కారణాలు ఉంటాయి.

భర్త గమనించాల్సినవి
భార్య పుట్టింటికి వెళితే ఎవరికో ఏవో కానుకలు ఇచ్చుకోవాలనుకోవచ్చు. తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లాలనుకోవచ్చు. మేనకోడలికి పట్టీలు తీసుకెళ్లాలనుకోవచ్చు. వీటికి బడ్జెట్‌ కేటాయించబడిందా? అవి లేక ఆమె ఏ విషయం తేల్చకుండా ఉందా?

భార్య అత్తింటికి వెళితే అక్కడ పనులన్నీ నెత్తిన పడే ప్రమాదం ఉందా? మరో కోడలి ఎదుట ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉందా? ఈ సంవత్సరం నేను ఈ నగ చేయించుకున్నాను అనంటే నేను ఏమీ చేయించుకోలేదు వంటి జవాబు చె΄్పాలనుకోవడం లేదా? అందుకే అత్తారింటికి వెళ్లడం గురించి ఆమె ఏ విషయం మాట్లాడటం లేదా?

భార్య గమనించాల్సినవి
పుట్టింటి నుంచి అల్లుడికి సరైన పిలుపు అందిందా? అక్కడకు వచ్చాక మంచి మర్యాదే దొరుకుతుందనే నమ్మకం ఉందా? తోడల్లుడు, బావమరిది... వీళ్లు ఆదరంగా చూసే వీలుందా? పండక్కు వస్తే భర్త ఏదైనా కానుక ఆశిస్తాడా? మంచి బట్టలైనా పెట్టాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటున్నట్టయితే ఆ కోరిక నెరవేర్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తీరా వచ్చాక అలకలు ఏర్పడతాయా? అందుకే అతను అత్తగారిల్లు అనే మాట ఎత్తడం లేదా?

టికెట్లు.. పాట్లు
► 
తాత్కాల్‌ను ఇలాంటి టైమ్‌లో నమ్ముకోలేము.
ఆర్టీసి బస్సులు ఎన్ని స్పెషల్స్‌ వేసినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు.
ప్రయివేటు ట్రావెల్స్‌ డబుల్‌ రేట్‌ చెప్తాయి. ఇంకా ఎక్కువే చెప్పాచ్చు.
సొంత కారు ఉన్నా పండగ ముందు రోజు బయలుదేరితే టోల్‌గేట్ల దగ్గరే సమయం సరిపోతుంది.
ముందే టికెట్లు బుక్‌ చేసుకోకపోవడం వల్ల తత్కాల్‌ చార్జీలు, ప్రయివేట్‌ బస్సుల చార్జీలు భరించలేక భార్యాభర్తలు టికెట్లు తీసుకుని పిల్లలకు తీసుకోకుండా ఫైన్లు కట్టి లేదా ఒళ్లు కూచోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం అవసరమా?
మరో విషయం ఎలాగోలా చేరుకుంటే ఎలాగోలా వెనక్కు రావచ్చు అనుకుంటారు. కాని తిరుగు ప్రయాణానికి అసలు టికెట్లు దొరకవు. దాంతో సెలవు పొడిగించుకుని, సద్ది బంధువుగా మారి ఇబ్బంది పడటం అవసరమా?

ఇప్పుడైనాప్లాన్‌ చేయండి
ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ. శనివారం ప్రయాణం అనుకోకండి. గురువారం ఉదయం నుంచి రైళ్లు, బస్సులు, కారు ప్రయాణంప్లాన్‌ చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పోనీ శుక్రవారం తెల్లవారు జాము నుంచి బయల్దేరండి. డబ్బు ఈ ఒక్కసారికే దుబారా అనుకుంటే కారు, ప్రయివేటు బస్సులో ప్రయాణం ఎంజాయ్‌ చేసేలా వెళ్లండి. పండగ మూడ్‌తో వెళ్లండి.

వెళ్లే ముందు భార్య తరపు ఇంటికి వెళ్లినా, భర్త తరపు ఇంటికి వెళ్లినా మన ఆర్థిక స్థితి మనది... మన ఆనంద స్థితి మనది... వేరొకరితో పోటీ వద్దు... తల్లిదండ్రులను అత్తామామలను ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడిపి వద్దాం అనుకుని బయలుదేరండి.
 
 

Advertisement
Advertisement