చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. | SRH Massive World Record Become Fastest Team In T20 History To Achieve | Sakshi
Sakshi News home page

SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..

Published Thu, May 9 2024 1:12 PM | Last Updated on Thu, May 9 2024 1:33 PM

SRH Massive World Record Become Fastest Team In T20 History To Achieve

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్‌ ఇచ్చింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. సొంత మైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడో గెలుపు నమోదు చేసింది.

విధ్వంసకర బ్యాటింగ్‌
తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ వల్లే ఇది సాధ్యమైంది.

ఉప్పల్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్‌ సేన.

సునామీ  ఇన్నింగ్స్‌
అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్‌ ఓపెనర్లు. ట్రావిస్‌ హెడ్‌ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్‌ శర్మ కూడా హిట్టింగ్‌తో మెరిశాడు.

హెడ్‌ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్‌ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.

ప్రపంచంలోనే తొలి జట్టు
👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్‌రైజర్స్‌ కావడం విశేషం. ఇక హెడ్‌, అభి విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

తద్వారా మరో వరల్డ్‌ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్‌ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..

టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్‌ 150+ ఛేజింగ్‌
1. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.
2. బ్రిస్బేన్‌ హీట్‌- మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.
3. గయానా అమెజాన్‌ వారియర్స్‌- జమైకా తలావాస్‌- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.

ఐపీఎల్‌ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్
👉లక్నో సూపర్‌ జెయింట్స్‌ మీద- 167/0 (9.4)- 2024లో
👉ఢిల్లీ క్యాపిటల్స్‌ మీద- 157/4- 2024లో
👉ముంబై ఇండియన్స్‌ మీద- 148/2- 2024లో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement