కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్ | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్

Published Thu, May 4 2023 6:44 AM

- - Sakshi

హైదరాబాద్: కార్పొరేటర్లకు బదులుగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్‌ చేసిన ఘటన బుధవారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. వాటర్‌బోర్డు అధికారులను తీవ్రంగా అవమానించారంటూ వాటర్‌బోర్డు అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేయగా, వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం తాము కూడా బాయ్‌కాట్‌ చేస్తున్నామంటూ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మేయర్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నిర్వహించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టినా మేయర్‌ వినిపించుకోలేదు. మంగళవారం డ్రైనేజీ సిల్ట్‌ను తీసుకువెళ్లి బీజేపీ కార్పొరేటర్లు వాటర్‌బోర్డు ఎండి కార్యాలయంలో పూలకుండీల్లో వేయడం తెలిసిందే. దీనికి నిరసనగా వాటర్‌బోర్డు అధికారులు వాకౌట్‌ చేశారు. సమావేశం మొదలైన దాదాపు 20 నిమిషాలకే బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్య వాయిదా వేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించడంతో సమావేశం ఎలాంటి చర్చ, ప్రశ్నోత్తరాలు లేకుండానే వాయిదా పడింది. వాయిదా పడ్డాక సైతం కార్పొరేటర్లు, అధికారులు ఎవరికి వారుగా ఎదుటివారి తీరును విమర్శిస్తూ వాదనలు వినిపించారు.

ఇంత చేస్తున్నా అవమానిస్తారా?
మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్న, బీజేపీ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌, నాలాలో మరణించిన బాలిక మౌనిక, ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. సభాధ్యక్షత వహించిన మేయర్‌ విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం ముగియగానే లంచ్‌ బ్రేక్‌ ప్రకటన చేయగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చే శారు. అంతలోనే వాటర్‌ బోర్డు ఈడీ సత్యనారాయణ తనకు మాట్లాడే అవకాశశమివ్వాలంటూ మాట్లాడారు. తాగునీరు, మురుగు నీరు నిర్వహణ పనులు చేస్తున్న తాము 186 కి.మీ నుంచి గోదావరి, 110 కి.మీ నుంచి కృష్ణాలతో పాటు సింగూరు, మంజీరాల నుంచి నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, 200 ఎయిర్‌టెక్‌ మెషీన్లతో మురుగునీటి సమస్యలు తీరుస్తున్నామని, అయినా తమను అవమానించినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నామంటూ వెళ్లిపోయారు. వెంటనే జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత లేచి వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులందరం బాయ్‌కాట్‌ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అందరూ వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి సభ జరగాలని పట్టుబట్టినా మేయర్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు.

అధికారులిలా ప్రవర్తిస్తారా?: బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు
ప్రజల కోసం పని చేస్తున్న తాము వారి సమస్యలను ప్రస్తావిస్తే పట్టించుకోని అధికారులు సభను బహిష్కరించడం దారుణమని బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు వాకౌట్‌ చేస్తారు కానీ.. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నిస్తే వాకౌట్‌ చేస్తారా? అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఓవైపు నాలాల్లో , అగ్ని ప్రమాదాల్లో, కుక్కకాట్లు, దోమలతో ప్రజలు చస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రజల ఈ సమస్యలు చర్చించాల్సిన సమావేశం జరగకుండా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు నాలాల్లో పసిప్రాణాల మరణాలు, కుక్కకాట్ల చావులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

నల్లదుస్తులతో సభకు..
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ తీరుకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు నల్లదుస్తులతో సభకు హాజరయ్యారు. సభ వాయిదా పడ్డాక సైతం కౌన్సిల్‌ హాల్‌లోనే ఉన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్‌ రావాలంటూ డిమాండ్‌ చేశారు. కరెంట్‌ తీసేసినా వారు కదలకపోవడంతో, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు.

నిరసన కార్యక్రమం కేటీఆర్‌కు ముందే తెలుసా?
అధికారులు నిరసన వ్యక్తం చేయనున్న విషయాన్ని సభకు ముందస్తుగానే వాటర్‌బోర్డు అధికారులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాటర్‌బోర్డులో జరిగిన ఘటనను ఎండీ దానకిశోర్‌ మంత్రికి వివరించగా, ఏ పార్టీ వారైనా కార్పొరేటర్లు అలా వ్యవహరించడం తగదని మంత్రి సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే వాటర్‌బోర్డుకు మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు బాయ్‌కాట్‌ చేశారంటున్నారు.

గతంలో అధికారుల వాకౌట్లు
గతంలో మాజిద్‌ హుస్సేన్‌ మేయర్‌గా ఉన్నప్పుడు కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేసినప్పటికీ, కొద్దిసేపు విరామం తర్వాత పలువురు నచ్చచెప్పడంతో తిరిగి సమావేశాన్ని నిర్వహించారు. సమీర్‌శర్మ కమిషనర్‌గా, బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు సైతం కమిషనర్‌ సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అధికారులంతా మూకుమ్మడిగా వాకౌట్‌ చేయడం ఇదే ప్రథమం. మేయర్‌ వచ్చాకే అధికారులు సభలోకి ప్రవేశించడం ఈ సందర్భంగా గమనార్హం.

ప్రజాధనం దుబారా..
ప్రతి సమావేశంలోనూ గందరగోళం సృష్టిస్తూ వాయిదా వేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, సమావేశాల సందర్భంగా భోజనాలు, ఇతరత్రా ఖర్చుల పేరిట జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.లక్షల ఖర్చు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

బ్లాక్‌డే: మేయర్‌
సభ వాయిదా పడ్డాక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి మేయర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీటులోకి రాకముందే తనను మహిళ అని కూడా చూడకుండా దూషించారని, అధికారులను సిగ్గుందా? అనడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ అప్రజాస్వామిక భాష వాడలేదన్నారు. కార్పొరేటర్లు అధికారులను అవమానించడంతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఇదొక బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు.

మర్యాద ఇవ్వకపోతే పనులు చేయం: మమత
కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే సహకరించబోమని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తెలిపారు. సభ వాయిదా అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ల అనుచిత ధోరణికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులు కష్టపడి పనిచేస్తున్నా, అందరి ముందూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు.

► గ్రేటర్‌ నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందంటూ బీజేపీ సభ్యులు వ్యంగ్యంగా ప్రదర్శనలు నిర్వహించారు. నన్ను చంపమని కోరేందుకు దోమ వేషంలో వచ్చానంటూ ఒకరు.. మేం కౌన్సిల్‌ హాల్లోకి వెళ్లాక ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఈ అగ్నిమాపక పరికరాలు ఇచ్చి పంపారని, కార్లలోనూ వీటిని ఉంచారని ఒకరు.. హఠాత్తుగా వానొస్తే చెరువులయ్యే రోడ్లతో కారు కొట్టుకుపోతే మాకు ఈత రానందున రక్షణగా టైర్లు, రక్షణ జాకెట్లు ఇచ్చారని కొందరు వివిధ పరికరాలతో, వేషధారణలతో వచ్చి సమావేశానికి ముందు వ్యంగ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు.

► ఈ రకంగానైనా అధికారులకు సిగ్గు వస్తుందేమోననే తలంపుతోనే ఈ ప్రదర్శనలకు దిగామన్నారు. అధికారులు బాయ్‌కాట్‌ చేయడం సిగ్గుచేటని, మేయర్‌ కౌన్సిల్‌ను అదుపు చేయలేకపోయారని సభ వాయిదాపడ్డాక కొప్పుల నరసింహారెడ్డి, ఆకుల శ్రీవాణి తదితర కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మేయర్‌ అనుమతి లేకుండానే, మేయర్‌ కుర్చీకి గౌరవమివ్వకుండా అధికారులు ఇష్టానుసారం వాకౌట్‌ చేయడం తగదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సభను అదుపు చేయలేని మేయర్‌ దిగిపోవాలని కొందరు డిమాండ్‌ చేశారు. అధికారులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేరని, జోన్లలోనూ అవే పరిస్థితులని, ప్రజలకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని డల్లాస్‌ చేస్తామని చెప్పినా, నాలాల్లో ప్రాణాలు పోతుండటం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వాటర్‌బోర్డు వైఫల్యాలు తెలుపుతూ పూల మొక్కలిచ్చేందుకు వెళ్లిన తమను గూండాల్లా భావించి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌, మేయర్‌ విజయలక్ష్మి మొద్దునిద్ర వీడాలన్నారు.

కొసమెరుపు..
వాటర్‌బోర్డు సమస్యను జీహెచ్‌ఎంసీ సమావేశంలో లేవనెత్తి సభను రద్దు చేయడమేంటో అంతుచిక్కడంలేదంటూ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జీహెచ్‌ఎంసీ సమావేశాలకు వాటర్‌బోర్డు అధికారులు హాజరు కారు. ఏమైనా అత్యవసర సందర్భాల్లోనే సంబంధిత అధికారి మాత్రమే హాజరవుతారు.

Advertisement
 
Advertisement
 
Advertisement