ఉమ్మడి కృష్ణా నుంచి పలువురు ఆశావహులు
బీసీ కోటాలో కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి
పార్టీ మారిన వారిలో యార్లగడ్డ, వసంత
ఎస్సీ కోటాలో తంగిరాల
బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని
తొలిసారైనా రేసులో వెనిగండ్ల
జనసేన నుంచి బుద్ధప్రసాద్
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో జయకేతనం ఎగరేసింది. ఇప్పుడు కేబినెట్‌లో స్థానం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కొందరు ఆశావహులు రేసులో ఉన్నారు. మంత్రివర్గం ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ స్థానాలపై కూటమిలో పార్టీల ప్రాతినిధ్యాలపై నేతలు చర్చించుకుంటున్నారు. సామాజిక వర్గాలతో పాటు, సీనియార్టీ ప్రకారం చూసినా ‘అమాత్యయోగం’ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారి జాబితా అధికంగానే ఉంది. ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ఉమ్మడి కృష్ణాలోని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు.
సాక్షి, విజయవాడ ప్రతినిధి, అవనిగడ్డ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏపీలో ‘ఎన్టీఏ కూటమి’ ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుంది. అయితే రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చేవారు. గతంలో వారికి ఇచ్చిన హామీలు, సామాజిక కోటాల పేరుతో మంత్రి పదవులు దక్కేవి. ఎన్డీఏ కూటమిలో టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు ఉన్నారు.
బీసీ కోటాలో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్ర చంద్రబాబు మంత్రి వర్గంలో, పార్థసారథి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ సీపీ నుంచి పార్థసారథి టీడీపీలో చేరారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన రవీంద్రకు మంత్రి పదవి వరించే అవకాశముంది.
ఎస్సీ, మహిళా కోటాలో..
నందిగామ నుంచి విజయం సాధించిన తంగిరాల సౌమ్య ఎస్సీ, మహిళా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రెండోసారి గెలుపొందిన ఆమెకు మంత్రిగా అవకాశం రావచ్చని తెలుస్తోంది.
మారిన కోటాలో..
మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీలో ఉన్న వీరిద్దరూ పారీ్టలు మారడం.. ఆ నియోజకవర్గాల నుంచి గెలుపొందడంతో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం కలిసొచ్చే అంశం.
పోటా పోటీ..
ఉమ్మడి కృష్ణాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గెలుపొందిన సుజనాచౌదరికి చంద్రబాబు ఆశీస్సులు ఉండటంతో మంత్రి వర్గం రేసులో ముందున్నారని తెలుస్తోంది. కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి ఏకైక అభ్యరి్థగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవి రేసులో ముందున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేయడం, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం కాపు సామాజిక వర్గం కావడంతో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.
పోటీలో గద్దె, బొండా, శ్రీరాం
విజయవాడ తూర్పు నుంచి గెలుపొందిన గద్దె రామ్మోహనరావు సీనియర్ కోటాలో, సెంట్రల్ నుంచి బొండా ఉమా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, జగ్గయ్యపేట నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన శ్రీరాం తాతయ్య వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నానిపై గెలుపొందిన వెనిగండ్ల రాము మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో నూతన మంత్రి వర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment