కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు అమాత్య పదవులపై కన్నేశారు. మంత్రి పీఠం ఎక్కేందుకు ముచ్చటపడుతున్నారు. దర్జాగా బుగ్గ కారులో తిరిగాలని ఆశపడుతున్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న కూటమి ప్రభుత్వంలో అధికారం అనుభవించాలని తహతహలాడుతున్నారు. కేబినెట్‌లో చోటు దక్కించుకుని పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఆశవహులు తమ అధినేతల ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కారులో ఉన్నత స్థానం పొందేందుకు చిత్తూరు ఎంపీ సైతం పోటీపడుతున్నారు.
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కూటమి గెలుపొందింది. త్వరలోనే కేబినెట్ కూర్పు జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. మంత్రి పదవులకు వచ్చేసరికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది.
జిల్లాలోనే సీనియర్ కావడం, గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, చంద్రబాబు, లోకేష్‌తో మంచి సంబంధాలు ఉండడం ఆయనకు కలిసిరానున్నట్లు సమాచారం. ఓసీ కోటా కింద ఒకరికి ఇవ్వాల్సి వచ్చినా.. చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓసీలకు అవకాశం లేదంటే.. ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు పూతలపట్టు నుంచి గెలుపొందిన మురళీమోహన్, మరొకరు గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే థామస్. ఈ ఇద్దరిలో మురళీమోహన్‌కి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కావడమే అందుకు కారణం . నగరి, చిత్తూరు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, జగన్‌మోహన్‌కి మంత్రి పదవి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.
తిరుపతి జిల్లా జాబితా పెద్దదే
జిల్లాలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి సారి గెలుపొందిన వారి జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా విజయశ్రీ ఉన్నారు. మహిళల కోటా కింద మంత్రి పదవి వరిస్తే.. విజయశ్రీకే అవకాశాలు ఉన్నాయి. బొజ్జల సుధీర్‌రెడ్డి విషయానికి వస్తే.. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్‌ని దింపేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబు ఆ కోణంలో ఆలోచిస్తే బొజ్జల సుధీర్‌రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశముంది. సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ కురుగొండ్ల రామకృష్ణ. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ల జాబితాలో ఇస్తే గిస్తే వెంకటగిరి ఎమ్మెల్యేనే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఎస్సీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. ఆదిమూలం లేదా పాశం సునీల్‌కుమార్.. వీరిలో ఎవరికో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం దక్కవచ్చు.
జనసేన కోటాలో ఆరణికి అవకాశం
కూటమిలో జనసేన పాత్ర కీలకం. ఈ కూటమి ఏర్పడడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కారణం. బీజేపీని ఒప్పించి టీడీపీతో జట్టు కట్టించారు. ఈ మూడు పార్టీలు ఏకమవడంతోనే అధికారం దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో సారి ఎమ్మెల్యే కావడం కూడా ఆయనకు కలిసి రానుంది.
కేంద్ర మంత్రి పదవిపైనా కన్ను!
చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాద్‌రావు కేంద్ర మంత్రి పదవిపై కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment