ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! | Sakshi
Sakshi News home page

ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు!

Published Fri, Jan 5 2024 3:06 AM

Big Story on Artificial Intelligence Robot - Sakshi

ఇంగ్లిష్‌ వాళ్ల నోస్ట్రడామస్‌ నుంచి మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దాకా.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఎవరు గెలుస్తారో చెప్పే ఆక్టోపస్‌ నుంచి చిలక జోస్యం దాకా.. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది చెప్పేవారికి ఎంతో డిమాండ్‌.. వినేందుకు మనం ఎప్పుడూ రెడీనే.మరి అలా 2024లో ఏమేం జరగవచ్చని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ అని అడిగితే.. కాస్త మంచి ముచ్చట్లు చెప్తూనే.. మరికాస్త ఆందోళన రేపే అంచనాలే వేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..

న్యూస్, నెట్‌.. శోధించి..
మనంతగా కాకున్నా మనలా ఆలోచించి సమాధానం చెప్పేలా, కావాల్సిన సమాచారం ఇచ్చేలా రూపొందినవే కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌లో విస్తృతమైన సమాచారం, వివిధ వార్తాంశాలను క్రోడీకరించి, వడపోసి.. మనకు అవసరమైన సమాచారాన్ని దాదాపు కచ్చితంగా అందించేలా వాటిని రూపొందిస్తారు.

ఓపెన్‌ ఏఐ సంస్థ రూపొందించిన ‘చాట్‌ జీపీటీ’, గూగుల్‌ అభివృద్ధి చేసిన ‘బార్డ్‌’, అమెజాన్‌ సాయంతో రూపొందిన ‘క్లాడ్‌’ ఏఐ ప్రోగ్రామ్‌లు అలాంటివే. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు తలెత్తవచ్చనే అంశంపై ‘డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్‌’ ప్రతినిధులు ఇటీవల బార్డ్, క్లాడ్‌ ఏఐ ప్రోగ్రామ్‌లను ప్రశ్నించారు. అవి ఇచ్చిన సమాధానంలోని కీలక అంశాలను వెల్లడించారు. తాజా సమాచారం, వార్తలపై ఎక్కువగా ఆధారపడేలా రూపొందించడం వల్లే ఇతర ఏఐలకు బదులు బార్డ్, క్లాడ్‌లను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలిపారు.

మనుషులను మించే.. 
2024లో కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌లు మనుషుల తరహాలో వివేచనతో వ్యవహరించే ‘ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏజీఐ)’ని సంతరించుకుంటాయని ‘క్లాడ్‌ ఏఐ’ అంచనా వేసింది. ‘‘వస్తువులను గుర్తించడం, గేమ్స్‌ ఆడటం, లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాల్లో ఏఐ ప్రోగ్రామ్‌లు ఇప్పటికే మనుషులతో సమానంగా, కొన్నిసార్లు మెరుగ్గా వ్యవహరిస్తున్నాయి.

డీప్‌ లెర్నింగ్, న్యూరల్‌ నెట్‌వర్క్‌లకు అవసరమైన శక్తివంతమైన కంప్యూటింగ్‌ వ్యవస్థలపై పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. మనుషులతో సమానంగా ‘ఏజీఐ’ని చూపే ఏఐ ప్రోగ్రామ్‌ల రూపకల్పన కోసం డీప్‌మైండ్, ఓపెన్‌ ఏఐ, గూగుల్‌ బ్రెయిన్, ఆంత్రోపిక్‌ వంటి సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో 2024లో ఏఐ ప్రోగ్రామ్‌లు మరింత తెలివి సంతరించుకుంటాయి..’’ అని క్లాడ్‌ స్పష్టం చేసింది.

మెదడు–కంప్యూటర్‌ కలసి.. మానవ యంత్రాలు వచ్చి..
మనుషుల శరీరానికే యంత్రాలను అమర్చుకుని అత్యంత సమర్థవంతంగా మారేందుకు 2024 వేదిక అవుతుందని ‘గూగుల్‌ బార్డ్‌’ అంచనా వేసింది. మెదడులో అమర్చే చిప్‌లతో కంప్యూటర్‌కు అనుసంధానం కాగలిగే బయోటెక్నాలజీ రూపొందుతుందని పేర్కొంది. ‘‘మనుషుల మెదడు–కంప్యూటర్‌ అనుసంధానికి వీలుకల్పించే ‘బ్రెయిన్‌–కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ)’లు అభివృద్ధి చెందుతాయి. దీని సాయంతో కృత్రిమ చేతులు, కాళ్లు వంటి అవయవాల (బయోనిక్‌ లింబ్స్‌)ను, ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి వీలవుతుంది.

భారీ బరువులను ఎత్తడం, అత్యంత వేగంగా పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం, మిలటరీ ఆపరేషన్స్‌ వంటివి సాధ్యమవుతాయి. అవయవాలు కోల్పోయినవారు, పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితం గడపవచ్చు. మెదడు–కంప్యూటర్లు కలగలిసి సృజనాత్మకత, మేధోశక్తి పెరుగుతుంది..’’ అని గూగుల్‌ బార్డ్‌ పేర్కొంది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ తాము రూపొందించిన బ్రెయిన్‌ చిప్‌లను ఈ ఏడాదే మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలించనుండటం గమనార్హం.

అంతర్జాతీయంగా..చైనా టెన్షన్‌
2024లో ప్రపంచవ్యాప్తంగా చైనా టెన్షన్‌ మరింత పెరుగుతుందని ‘క్లాడ్‌’ అంచనా వేసింది. కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలు పెరగవచ్చని పేర్కొంది. ‘‘తైవాన్, చైనా మధ్య వివాదం, ఇతర అంశాలతో చైనాకు.. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చు. 2024లో తైవాన్‌ పూర్తి స్వాతంత్య్రం ప్రకటించుకునే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ విషయంలో చైనా మిలటరీతో దుందు డుకుగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుంది..’’ అని క్లాడ్‌ పేర్కొంది.

ఎన్నికలు.. హ్యాక్‌ అవుతాయి!
ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను ఎన్ను కునే ప్రక్రియ ఏఐ సాయంతో హ్యాక్‌ అవుతుందని ‘గూగుల్‌ బార్డ్‌’ అంచనా వేసింది. సోషల్‌ మీడియాలో, బయటా ఎన్నికల ప్రచారం కొందరికి అనుకూలంగా, పక్షపాతంగా ఉండేలా.. ఓటర్లను ప్రభావితం చేసేలా ‘కృత్రిమ మేధ’ సాయంతో ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొంది. ‘‘ఓటర్ల డేటాబేస్‌ హ్యాక్‌ కావొచ్చు. దాని సాయంతో ఓటర్లను బ్లాక్‌మెయిల్‌ చేయవచ్చు. కావాల్సిన వారికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేయొచ్చు. డీప్‌ఫేక్‌ సాయంతో తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఓటింగ్‌ యంత్రాలు, ఫలితాలను వెల్లడించే వ్యవస్థలనూ ఏమార్చే ప్రయత్నాలు జరుగుతాయి..’’ అని తెలిపింది.

బతికేదెంతో చెప్పేస్తామంటూ.. 
కావాల్సినట్టు, ఊహలకు తగినట్టుగా ఫొటోలు, వీడియోలను సృష్టించే ఏఐ ప్రోగ్రామ్‌లు ఎన్నో తెరపైకి వచ్చాయి. దీనికితోడు ఇటీవల మీరు ఎంతకాలం బతుకుతారో అంచనా వేసే ‘లైఫ్‌2వెక్‌’ వంటి కృత్రిమ మేధ ప్లాట్‌ఫామ్‌లూ మొదలయ్యాయి. వయసు, శారీరక స్థితి, ఆరోగ్యం, వ్యాధులు, అలవాట్లు, ఉద్యోగం, నివాస పరిస్థితులు వంటి వివరాలిస్తే.. విశ్లేషించి ఎంతకాలం జీవించవచ్చనే అంచనా వేసి చెప్పేస్తున్నాయి. ఎక్కువ కాలం జీవించాలంటే.. మన అలవాట్లు, పరిస్థితులలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో కూడా సూచిస్తున్నాయి. ఇవన్నీ కచ్చితంగా కావాలనేం లేదు. కానీ ‘ఏఐ’ చెప్తున్నది మాత్రం దగ్గరగానే ఉందంటున్నారు నెటిజన్లు.   

మనిషికి తగినట్టు..మందులు
జ్వరం వచ్చిందా, మరేదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా.. ఎవరికైనా దాదాపు ఒకే రకమైన మందులు వాడుతుంటారు. ఒకే తరహా చికిత్స అందిస్తుంటారు. ఇకపై వ్యక్తుల శరీరతత్వం, వారి డీఎన్‌ఏకు అనుగుణంగా వేర్వేరు ఔషధాలు, వేర్వేరు మోతాదుల్లో ఇచ్చేలా, భిన్నమైన చికిత్సలు అందించే వైద్య రంగం అభివృద్ధి చెందుతుందని ‘గూగుల్‌ బార్డ్‌’ పేర్కొంది. ‘‘కృత్రిమ మేధ ఆధారిత వైద్యారోగ్య సదుపా యాలు అందుబాటులోకి వస్తాయి.

వ్యక్తుల జన్యువులు, వారి జీవనశైలి, నివసించే పరిస్థితులు, పర్యావరణం ప్రభావం వంటివి పరిశీలించి.. భవిష్యత్తులో రాగలిగే వ్యాధులు, ఆరోగ్య సమస్యలను అంచనా వేసే సాంకేతికత వస్తుంది.వారు చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలనూ ఏఐ సూచిస్తుంది. వివిధ వ్యాధులకు ఉండే వేర్వేరు లక్షణాలు, వైద్య పరీక్షల రిపోర్టులు, వాడే మందులు, వాటి ఫలితాలను సమగ్రంగా పరిశీలించి.. ఎలాంటి చికిత్స అందించాలనేది తేల్చుతుంది.

 
Advertisement
 
Advertisement