పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు! | Earthquake Of Magnitude 6.9 In Papua New Guinea, See Details Inside - Sakshi
Sakshi News home page

Papua New Guinea Earthquake: పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!

Published Sun, Mar 24 2024 6:59 AM

Earthquake in Papua New Guinea - Sakshi

పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. 

ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్‌జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్‌) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. 

ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.  ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్‌’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement