ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్‌ లేకుండా ఫ్లైట్‌ ఎక్కి.. | Sakshi
Sakshi News home page

US: ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్‌ లేకుండా ఫ్లైట్‌ ఎక్కి..

Published Sat, Feb 17 2024 11:16 AM

US Woman Sneaked Past Nashville Airport Security Boards - Sakshi

అమెరికాలోని ఓ మహిళ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్‌విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కింది. 

‘న్యూయార్క్ పోస్ట్‌’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్‌విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్‌ఏ) స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఫిబ్రవరి 7న నాష్‌విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్‌ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్‌ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement