మండుతున్న ఓసీపీలు | Sakshi
Sakshi News home page

మండుతున్న ఓసీపీలు

Published Fri, Apr 19 2024 1:45 AM

మందమర్రి కేకే ఓసీపీలో వేసిన చలువ పందిరి
 - Sakshi

● భానుడి భగభగతో పెరిగిన ఉష్ణోగ్రతలు ● 44 డిగ్రీల వరకు నమోదు ● సతమతం అవుతున్న కార్మికులు ● క్వారీల్లో చలువ పందిళ్ల ఏర్పాటు ● షిఫ్ట్‌ వేళలు మార్చాలని డిమాండ్‌

శ్రీరాంపూర్‌: రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో సింగరేణి ఓసీపీలు మండుతున్నాయి. భానుడి భగభగతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండలు ముదురడంతో ఓసీపీల్లో కార్మికులు వేడికి అల్లాడుతున్నారు. బెల్లంపల్లి రీజియన్‌లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఉన్న ఐదు ఓసీపీల్లో 20 రోజుల క్రితం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరువాత ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం రీజియన్‌లోని ఓసీపీల్లో సరాసరిగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. దీంతో కార్మికులు పని చేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే కోల్‌మైనింగ్‌ ఉన్న చోట ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. ఓసీపీల్లో నల్లని కోల్‌ అంతా ఎక్స్‌పోజ్‌ అయ్యి ఉండడం, దీనికి తోడు కొన్ని భూగర్భ గనులు ఓసీపీలుగా మార్చడం వల్ల పాత పని స్థలాలు బయటపడ్డప్పుడు కోల్‌ఆక్సిడేషన్‌ అయ్యి అక్కడక్కడ మంటలు రావడం జరుగుతుంది. దీంతో ఓసీపీ క్వారీల్లో వేడి అధికంగా నమోదు అవుతుంటుంది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు డ్యూటీకి వచ్చి పోయేటప్పుడే తప్ప లోపలికి వెళ్లిన తరువాత ఏమాత్రం బయటి వాతావరణంతో సంబంధం ఉండదు. కానీ ఓసీపీల్లో కార్మికులంతా ఆరు బయట ఉండి పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీరు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మండుతున్న ఎండలకు విధుల్లోకి వెళ్లిన కొద్ది సేపటికి యూనిఫాం పూర్తిగా చెమటతో తడిసిపోతోందని, ఒళ్లంతా వేడెక్కుతోందని కార్మికులు వాపోతున్నారు. ఉదయం 11 గంటలకే భానుడు ప్రతాపం చూపెడుతున్నాడని పేర్కొంటున్నారు. కొన్ని ఓసీపీల్లో పని స్థలాల వద్ద అక్కడక్కడ రెస్టు షెల్టర్లు ఉన్నా ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. ఉదయం షిఫ్ట్‌ ఉద్యోగుల కంటే సెకండ్‌ షిఫ్ట్‌ ఉద్యోగులు అధికంగా ఎండ తీవ్రతకు గురవుతున్నారు. ప్రతీ వేసవిలో కంపెనీ ఉపశమన చర్యలు చేపడుతుంది. ఈసారి ముందే ఎండలు మండుతున్నందున యాజమాన్యం వేసవి ఉపశమన చర్యలు మరిన్ని చేపట్టాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఎండల తీవ్రత పెరి గితే కార్మికుల హాజరు శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

పని వేళలతో పరేషాన్‌..

ప్రస్తుత పనివేళలతో వేసవిలో ఉద్యోగులు పరేషాన్‌ అవుతున్నారు. ఓసీపీల్లో ఎండ తీవ్రత దృష్ట్యా షిఫ్ట్‌ వేళలు మార్చాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఫస్ట్‌షిఫ్ట్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ప్రతీ వేసవిలో ఎండల తీవ్రత పెరిగితే షిఫ్ట్‌ వేళలను కంపెనీ మార్చుతుంది. ఉదయం షిఫ్ట్‌ను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12గంటలకు మార్చుతారు. ఈ వేళలను తక్షణమే అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా కార్మికులకు ఓఆర్‌ఎస్‌, మజ్జగ ప్యాకేట్లను కంపెనీ పంపిణీ చేస్తుంది. శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీల్లో మూడు రోజుల నుంచి ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు ఇస్తున్నా మజ్జిగ ఆదివారం నుంచే ఇస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కై రీగూడ, మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీల్లో కూడా వీటిని పంపిణీ చేస్తున్నారు. కై రిగూడ ఓసీపీలో ఉద్యోగులకు గొడుగులు, కూల్‌వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. ఇప్పటివరకు క్వారీలో వేసిన చలువ పందిళ్లు సరిపోవని, మరిన్ని చలువ పందిళ్లు తాము పని చేసే చోట సమీపంలోనే ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు. అన్ని డంపర్లు, షవల్స్‌లో ఏసీలు ఫుల్‌ కండీషన్‌ చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులవి ప్రాణాలు కావా...?

ఓసీపీలు, ఇతర ఉపరితల డిపార్టుమెంట్లలో పని చేసే కాంట్రాక్ట్‌ కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదు. వారికి కూడా పర్మినెంట్‌ కార్మికులకు ఇస్తున్నట్లుగా మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఓసీపీల్లో చాలామంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. వారు కూడా ఎండవేడితో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. తమవి కూడా ప్రాణాలేనని వారు వాపోతున్నారు. తమకు కూడా మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు పంపిణి చేయాలని కోరుతున్నారు.

తక్షణమే వేళలు మార్చాలి

ఓసీపీల్లో షిఫ్ట్‌ వేళలను తక్షణమే మార్చాలి. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. దీనిపై కార్పొరేట్‌ అధికారులు నిర్ణయం తీసుకొని ఏరియాలకు ఆదేశాలివ్వాలి. ఓసీపీ ఇతర సర్ఫేస్‌ డిపార్టుమెంట్లలో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు పంపిణీ చేయాలి. –ఎస్కే బాజీసైదా, గుర్తింపు

సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి

బెల్లంపల్లి కై రిగూడ ఓసీపీలో గొడుగులు  పంపిణీ చేస్తున్న అధికారులు
1/1

బెల్లంపల్లి కై రిగూడ ఓసీపీలో గొడుగులు పంపిణీ చేస్తున్న అధికారులు

Advertisement
Advertisement