Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా! | IPL 2024 Playoffs Scenario: How Hardik MI Got Knocked Out By SRH Win Over LSG | Sakshi
Sakshi News home page

Playoffs: రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. పాండ్యా సేన కథ ముగిసిందిలా!

Published Thu, May 9 2024 10:14 AM | Last Updated on Thu, May 9 2024 10:17 AM

ముగిసిన ముంబై ప్రయాణం (PC: BCCI)

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ నిష్క్రమించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ ఫలితంతో పాండ్యా సేన టాప్‌-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్‌ చిత్తు ఓడించడంతో ఈ సీజన్‌లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.

ఎలా అంటే?
ఉప్పల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్‌ రాహుల్‌ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్‌ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

 

టాప్‌-2లో తిష్ట వేసిన కేకేఆర్‌, రాజస్తాన్‌
మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(రన్‌రేటు 1.453), రాజస్తాన్‌ రాయల్స్‌(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్‌-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌(రన్‌రేటు -0.316), లక్నో సూపర్‌ జెయింట్స్‌(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.

పాండ్యా సేనకు తప్పని పరాభవం
మరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్‌ కింగ్స్‌(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.

మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్‌-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! 

ఇక అట్టడుగున ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌, రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ దాదాపుగా ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.

చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్‌.. అందరూ చూస్తుండగానే అలా..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement