BCCI: హార్దిక్‌ పాండ్యాకు భారీ షాక్‌.. ఐపీఎల్‌-2025లో.. | IPL 2024: BCCI Bans Hardik Pandya For 1 Match Slaps Him With Hefty Fine | Sakshi
Sakshi News home page

BCCI: హార్దిక్‌ పాండ్యాకు ఊహించని షాక్‌.. ఐపీఎల్‌ 2025లో ఇక..

Published Sat, May 18 2024 10:29 AM | Last Updated on Sat, May 18 2024 2:57 PM

IPL 2024: BCCI Bans Hardik Pandya For 1 Match Slaps Him With Hefty Fine

హార్దిక్‌ పాండ్యా(PC: BCCI)

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.

కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్‌ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్‌ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టు
ఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్‌ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.

ఇక లీగ్‌ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.

ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్‌ పాండ్యాకు పనిష్మెంట్‌ ఇచ్చింది.

ఐపీఎల్‌-2025లో తొలి మ్యాచ్‌ ఆడకుండా నిషేధం
ఈ మేరకు.. ‘‘ఈ సీజన్‌లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. 

అంటే ఐపీఎల్‌-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. 

ముంబై జట్టు మొత్తానికి జరిమానా
‘‘లక్నోతో మ్యాచ్‌ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. 

కాగా ఐపీఎల్‌-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement