MI Vs LSG: లక్నో విజయంతో ముగింపు | IPL 2024 MI Vs LSG: Lucknow Super Giants Beat Mumbai Indians By 18 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 MI Vs LSG Highlights: లక్నో విజయంతో ముగింపు

Published Sat, May 18 2024 4:20 AM | Last Updated on Sat, May 18 2024 1:43 PM

Lucknow ends with victory

18 పరుగులతో ముంబైపై గెలుపు 

పూరన్‌ విధ్వంసం

రోహిత్‌ మెరుపులు వృథా  

ముంబై: ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌ దశకు దూరమైంది. ఇప్పుడు ఆఖరి స్థానంతో లీగ్‌ దశను పేలవంగా ముగించింది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. 

ముందుగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (29 బంతుల్లో 75; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సునామీలా చెలరేగిపోయాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. పియూశ్‌ చావ్లా, తుషారా చెరో 3 వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 68; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (28 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించారు. 

పూరన్‌ ధనాధన్‌ 
పది ఓవర్లలో లక్నో స్కోరు 69/3. పడిక్కల్‌ (0), స్టొయినిస్‌ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు), దీపక్‌ హుడా (11) అవుటయ్యారు. ఇంకో 10 ఓవర్లలో వంద కొట్టినా... 170 దాటదు! కానీ పూరన్‌ తన 29 బంతుల్లో అంతా మార్చేశాడు. రాహుల్‌తో కలిసి విధ్వంసరచన చేశాడు. 

అన్షుల్‌ 13వ ఓవర్లో పూరన్‌ 4, 0, వైడ్, 4, 6, 6, 1లతో 22 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్‌ను అర్జున్‌ టెండూల్కర్‌ ప్రారంభించి 2 బంతులేస్తే పూరన్‌ సిక్సర్లుగా మలిచాడు. కండరాలు పట్టేయడంతో అర్జున్‌ వెనుదిరిగాడు. మిగతా ఓవర్‌ను నమన్‌ ధీర్‌ వేయగా పూరన్‌ 6, 4, 1 కొట్టాడు. 

ఆఖరి బంతిని రాహుల్‌ సిక్స్‌ బాదడంతో ఈ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. పూరన్‌ 19 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకోగా... రాహుల్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆఖర్లో బదోని (10 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో లక్నో 200 పైచిలుకు స్కోరు చేసింది. 

రోహిత్, ధీర్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ 
భారీ లక్ష్యఛేదనకు అవసరమైన హిట్టింగ్‌తో రోహిత్‌ ముంబై స్కోరును పరుగుపెట్టించాడు. మరో ఓపెనర్‌ బ్రెవిస్‌ (20 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంలో వెనుకబడినా రోహిత్‌ బౌండరీలతో జోరు కనబరిచాడు. 28 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 88 పరుగుల వద్ద బ్రెవిస్‌ అవుటయ్యాక ముంబై తడబడింది. 

సూర్యకుమార్‌ (0), రోహిత్, హార్దిక్‌ (16), నేహల్‌ (1) వికెట్లను కోల్పోవడంతో ముంబై లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో నమన్‌ ధీర్‌ మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. నమన్‌ 25 బంతుల్లో అర్ధసెంచరీ సాధించినా ముంబైని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. 

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) తుషారా (బి) చావ్లా 55; పడిక్కల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషారా 0; స్టొయినిస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 28; హుడా (సి) నేహల్‌ (బి) చావ్లా 11; పూరన్‌ (సి) సూర్య (బి) తుషారా 75; అర్షద్‌ (సి) నేహల్‌ (బి) తుషారా 0; బదోని (నాటౌట్‌) 22; కృనాల్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–1, 2–49, 3–69, 4–178, 5–178, 6–178. బౌలింగ్‌: తుషారా 4–0–28–3, అర్జున్‌  2.2–0–22–0, అన్షుల్‌ 3–0–48–0, పియూశ్‌ చావ్లా 4–0–29–3, నేహల్‌ 2–0– 13–0, హార్దిక్‌ 2–0–27–0, నమన్‌ 0.4–0–17–0, షెఫర్డ్‌ 2–0–30–0. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మోసిన్‌ (బి) బిష్ణోయ్‌ 68; బ్రెవిస్‌ (సి) కృనాల్‌ (బి) నవీనుల్‌ 23; సూర్య (సి) బిష్ణోయ్‌ (బి) కృనాల్‌ 0; ఇషాన్‌ (బి) నవీనుల్‌ 14; హార్దిక్‌ (సి) నవీనుల్‌ (బి) మోసిన్‌ 16; నేహల్‌ (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 1; నమన్‌ (నాటౌట్‌) 62; షెఫర్డ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–88, 2–89, 3–97, 4–116, 5–120, 6–188. బౌలింగ్‌: అర్షద్‌ 2–0–11–0, హెన్రీ 2–0–24–0, కృనాల్‌ 4–0–29–1, మోసిన్‌ 4–0– 45–1, నవీనుల్‌ 4–0–50–2, రవి బిష్ణోయ్‌ 4–0–37–2.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement