SRH: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా | Sakshi
Sakshi News home page

Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్‌

Published Fri, May 17 2024 5:27 PM

SRH Pat Cummins Plays Gully Cricket With School Kids in Hyderabad Viral

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన పనికి ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్‌ మామా.. మా హృదయాలు గెలుచుకున్నావు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదంతా కేవలం.. సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే! ఆరెంజ్‌ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లే ఆఫ్స్‌ చేరింది.

ఆ తర్వాత గత మూడేళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడింది. అయితే, ఐపీఎల్‌-2024లో మాత్రం పూర్తిగా సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడు టాప్‌-2 రేసులోనూ సన్‌రైజర్స్‌ముందు వరుసలో ఉంది.

టికెట్‌ కన్ఫామ్‌
ఆస్ట్రేలియా సారథి, 2023 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ప్యాట్‌ కమిన్స్‌, కొత్త కోచ్‌ డానియల్‌ వెటోరి రాకతో ఆరెంజ్‌ ఆర్మీ ఇలా విజయవంతమైన పంథాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్తుపై కన్నేసిన కమిన్స్‌ బృందం గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్‌ కన్ఫామ్‌ చేసుకుంది.

ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తర్వాత టాప్‌-4లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్‌-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్‌
ఇదిలా ఉంటే.. రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్‌ సాబ్‌.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. 

కాగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటి దాకా ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఒకటి రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్‌ అతడిని రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement