‘మూడొంతుల మెజారిటీ ఖాయం.. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం’ | Sakshi
Sakshi News home page

‘మూడొంతుల మెజారిటీ ఖాయం.. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం’

Published Sun, Nov 26 2023 10:11 PM

Congress will come back to power in Chhattisgarh says CM Baghel - Sakshi

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో నాలుగింట మూడొంతుల మెజారిటీతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. తెలంగాణలోని కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. కాబట్టి అక్కడ నాలుగింట మూడు వంతుల మెజారిటీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. 

కాంగ్రెస్‌ను నమ్మండి..
‘కాంగ్రెస్‌ను నమ్మండి... కేసీఆర్‌ని మీరు చాలా చూశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వారిని నమ్మండి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మీరే బలపడతారు’ అని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు 17 శాఖలను తమ వద్దే ఉంచుకున్నారని, తెలంగాణపై రూ.5 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు మార్చకుంటే రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు పెరుగుతాయన్నారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి భూపేంద్ర బఘేల్‌ సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో  పోస్ట్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ తన ఇద్దరు "పిల్లల" భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోందంటూ పేర్లు తీసుకోకుండా పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఇక్కడ కూడా పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాసుకొచ్చారు.

Advertisement
Advertisement