అకాల వర్షంతో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో ఆందోళన

Published Sat, May 4 2024 1:00 AM | Last Updated on Sat, May 4 2024 1:00 AM

అకాల

●పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన ●కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ●విరిగి పడిన చెట్లు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు ●స్తంభాలు పడిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ●చల్లబడిన వాతావరణంతో ప్రజలకు ఉపశమనం

అశ్వాపురం/భద్రాచలంటౌన్‌: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అశ్వాపురం మండలం తుమ్మలచెరువు ఆయకట్టు పరిధిలో రబీ సాగు వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొండికుంట, మల్లెలమడుగు, రామచంద్రాపురం, నెల్లిపాకబంజర, బీజీకొత్తూరు, సీతరాంపురం, ఆనందాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, ఖాళీ స్థలాల్లో రైతులు పెద్ద ఎత్తున ధాన్యం ఆరబోశారు. అకాల వర్షానికి రైతులు ఆవేదన చెందుతున్నారు. పరదాలు, టార్పాలిన్లు కప్పుతూ ఉరుకులు పరుగులు పెట్టారు. భద్రాచలంలో భారీ వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారానికి చెట్లతోపాటు షాపుల బోర్డులు సైతం విరిగిపడ్డాయి. సుమారు రెండు గంటలపాటు వాన కురియడంతో వాతావరణం చల్లబడగా, వారం రోజులుగా అధిక ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. చర్ల, కూనవరం రోడ్లలో చెట్లు విరిగి రహదారులపై పడగా, అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్‌ వైర్లపై పడటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణంలో అంధకారం అలుముకుంది. కాగా, భద్రాచలం పట్టణంలో సాయంత్రం ఒకవైపు వర్షం పడుతుండగా మరో పక్క సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించడం ప్రజలను ఆకట్టుకుంది.

ములకలపల్లిలో..

ములకలపల్లి: భారీ ఈదరుగాలులు వీయడంతో మాధారం, సీతాయిగూడెం ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. మాధారం అటవీ ప్రాంతంలో చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది.

తడిసిన ధాన్యం

పాల్వంచరూరల్‌: ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వానకు పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిపోయిందని రైతులు కంటే గోవర్ధన్‌, నిమ్మల నాగేంద్రబాబు, కంటే నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దంతలబోరు ఎస్సీ కాలనీ గ్రామపంచాయతీ సీతారాంపురం గ్రామంలో బలమైన గాలులకు 20 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నివాసాలపై చెట్లు కూలిపడ్డాయి. పైకప్పు ఎగిరిపోయి తీవ్ర నష్టం జరిగిందని గిరిజనులు మడవి దేవా, రవ్వ అంజని, ముచికి గంగా, వేట్టి సునీల్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అకాల వర్షంతో ఆందోళన1
1/3

అకాల వర్షంతో ఆందోళన

అకాల వర్షంతో ఆందోళన2
2/3

అకాల వర్షంతో ఆందోళన

అకాల వర్షంతో ఆందోళన3
3/3

అకాల వర్షంతో ఆందోళన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement