
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’’ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.
గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.
దీనిపై పవన్ కల్యాణ్ మంగళవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద స్పందించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. ‘‘ ప్రకాష్ రాజ్‌తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని’’ అని పేర్కొన్నారు. ఈ లోపు..
ఈలోపే.. ‘సత్యం సుందరం’ ఈవెంట్‌లో ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ అని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడంపైనా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైందని అనడంతో అక్కడికి ఆ వివాదం ముగిసింది. అయితే.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోదని అర్థమైంది.

Comments
Please login to add a commentAdd a comment