విజయవాడ, సాక్షి: ఒక సనాతనవాదిగా, హిందువుగా బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా తనకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నారు. హిందువులకు ఇతర మతాలపై విద్వేషం ఉండదని, కానీ, సెక్యులరిజం అనేది అన్ని వైపులా నుంచి రావాలని అన్నారాయన.
మంగళవారం ఉదయం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి పవన్ వచ్చారు. ఆపై తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ సహా తన మీద పలువురు విమర్శలు చేయడంపై ఆయన స్పందించారు. ‘‘సాటి హిందువులే హిందుత్వాన్ని కించపరుస్తున్నారు. తోటి హిందువులను కించపరుస్తున్నారు. ఇష్టానికి మాట్లాడుతున్నారు. మరి మిగతా మతాల మీద జోకులేయరేం?. నన్ను పచ్చిబూతులు తిట్టినా మౌనంగా ఉన్నా. కానీ నన్ను విమర్శించేవాళ్లకు చెబుతున్నా. సనాతన ధర్మం జోలికి రావొద్దు. చేస్తే.. బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా నాకుంది.
.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రిదాకా రామనామమే వినిపిస్తుంది. రామ భక్తులం మేం. అలాంటిది సనాతన ధర్మం మీద దాడి జరిగితే మాట్లాడొద్దంటే.. ఏమనాలి?. హిందువులుగా అది మీ బాధ్యత కాదా? ధర్మాన్ని పరిరక్షించరా?’’.
.. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ను తానేం నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని, ఆ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని మాత్రమే కోరుతున్నానని పవన్ అన్నారు.
.. ‘‘భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా?. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి. మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డూ గురించి మాట్లాడారు’’.
తనను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. ‘‘అపవిత్రం జరిగిందనే నేను మాట్లాడాను తప్ప.. మరో మతాన్ని ఏమైనా నిందించానా?. ఆ మాత్రం దానికే గోల చేయకూడదని ప్రకాశ్ రాజ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా?. ఏం పిచ్చి పట్టింది మీకు? ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరంటే గౌరవం ఉన్నా.. అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను.
.. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు. మాకు ఇదంతా చాలా బాధ. మీ ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా?. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టే సనాతన ధర్మం బోర్డు రావాలని తాను కోరుతున్నానని అన్నారు. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా?’’ అని పవన్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఈ పెద్దమనిషికి సనాతన ధర్మం అంటే తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment