నా జీవితం పూలపాన్పు కాదు | Sakshi
Sakshi News home page

నా జీవితం పూలపాన్పు కాదు

Published Sun, Mar 3 2024 5:33 AM

Mukesh Ambani in tears as Anant speaks on health issues - Sakshi

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అనంత్‌

ఆరోగ్య సమస్యల ప్రస్తావన

ముకేశ్‌ దంపతుల కంటతడి

ఆహూతుల్లో భావోద్వేగం

జామ్‌నగర్‌: అక్షరాలా ఆకాశమంత పందరి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్‌ వేడుక. ఆహూతులుగా ప్రపంచ స్థాయి సినీ, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు. అంతటా ఆనందం వెల్లివిరుస్తున్న వేళ. పెళ్లికొడుకు కాబోతున్న తన చిన్న కుమారుడు అనంత్‌ మాట్లాడిన మాటలు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని కంటతడి పెట్టించాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటైన సువిశాలమైన ప్రాంగణం ఇందుకు వేదికైంది.

మూడు రోజుల వేడుకల్లో తొలి రోజు శుక్రవారం అనంత్‌ మాట్లాడుతూ చిన్ననాటి నుంచీ తనను వేధిస్తూ వస్తున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు. ‘‘అంతా అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పేమీ కాదు. భరించలేని బాధల వాడిముళ్లు చిన్ననాటి నుంచీ విపరీతంగా వేధించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు! కానీ అన్ని బాధలను అధిగమిస్తూ వచ్చానంటే మా అమ్మానాన్నే కారణం! నన్నెంతో అపురూపంగా చూసుకున్నారు.

నిరంతరం నా వెన్నంటి నిలిచారు. నా జీవితంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పెళ్లి వేడుకను నాకు అత్యంత స్పెషల్‌గా మలచేందుకు వాళ్లు, నా కుటుంబ సభ్యులు ఎంతగా కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. వాళ్లెవరూ కొద్ది నెలలుగా రోజుకు 3 గంటల కంటే నిద్రే పోలేదు. వేడుకలను ఇంత గొప్పగా తీర్చిదిద్ది నన్ను సంతోషపెట్టేందుకు రోజుకు కనీసం 20 గంటల పాటు కఠోరంగా శ్రమిస్తూ వచ్చారు’’ అంటూ ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. అనంత్‌ మాటలను ఆహూతులతో పాటు ఆసాంతం వింటూ, ఆ క్రమంలో ముప్పిరిగొన్న రకరకాల భావోద్వేగాల నడుమ ముకేశ్, నీతా అంబానీ దంపతులు తడి నిండిన కళ్లతో కుమారున్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉండిపోయారు. దాంతో అందరి
మనసులూ భారమయ్యాయి.

దిగ్గజాల సందడి
అనంత్, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచీ ప్రముఖులంతా తరలివచ్చారు. పారిశ్రామిక, సినీ, క్రికెట్‌ దిగ్గజాలంతా వేడుకల్లో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్, మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్, పారిశ్రామిక దిగ్గజాలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్, సల్మాన్‌ఖాన్, దీపికా పడుకొణె, క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీతో పాటు పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. 1,000 మందికి పైగా వీఐపీలు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహానా ప్రధానాకర్షణగా నిలిచారు. డైమండ్స్, రూడ్‌బోయ్, పోరిటప్‌ వంటి తన ఆల్‌టైం హిట్‌ నంబర్స్‌కు ఆడి పాడి ఆహూతులను ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయకుడు అరిజిత్‌సింగ్‌ తదితరులు ఆహూతులను తమ గానంతో అలరించారు. 

Advertisement
Advertisement