అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్‌ పాండ్యా | 'Lot of Questions, Will Take Some Time To Answer': Hardik Pandya After MI Loss | Sakshi
Sakshi News home page

అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్‌ పాండ్యా

Published Sat, May 4 2024 8:48 AM | Last Updated on Sat, May 4 2024 9:07 AM

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్‌ ముందు తలవంచింది. శ్రేయస్‌ అయ్యర్‌ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

అంతేకాదు ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.

ఓటమికి కారణం అదే
 ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.

మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.

నిజానికి తొలి ఇన్నింగ్స్‌ తర్వాత వికెట్‌ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.

సవాళ్లంటే ఇష్టం
ఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్‌ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.

సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్‌ చేతిలో ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు.

పూర్తిగా విఫలం
కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.

ముంబై వర్సెస్‌ కేకేఆర్‌ స్కోర్లు
👉టాస్‌: ముంబై.. తొలుత బౌలింగ్‌
👉కేకేఆర్‌ స్కోరు: 169 (19.5)
👉ముంబై స్కోరు: 145 (18.5)

👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వెంకటేశ్‌ అయ్యర్‌(కేకేఆర్‌- 52 బంతుల్లో 70 రన్స్‌)
👉ముంబై ఇండియన్స్‌ టాప్‌ స్కోరర్‌: సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56 రన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement