పవన్‌ వ్యూహానికి వంగా గీత కౌంటర్‌ వ్యూహమిదే..! | Ksr Comments on Pawan kalyan Pithapuram Constituency Campaign | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో పవన్‌ వ్యూహానికి వంగా గీత కౌంటర్‌ వ్యూహమిదే..!

Published Sat, May 4 2024 10:59 AM | Last Updated on Sat, May 4 2024 11:58 AM

Ksr Comments on Pawan kalyan Pithapuram Constituency Campaign

పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. 

వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. 

ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.

పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్‌ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. 

ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్‌ అయితే ఎక్కడో షూటింగ్‌లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.

లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్‌ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.

పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి  పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్‌ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.

జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్‌ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement