12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం! | Sakshi
Sakshi News home page

12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం!

Published Wed, Mar 13 2024 6:06 AM

BJP aims to secure over 12 MP seats in Telangana: Amit Shah - Sakshi

ఆ మేరకు సర్వే నివేదికలు అందాయి 

రాష్ట్ర పార్టీ నేతలతో కేంద్రమంత్రి అమిత్‌షా 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్టుగా తాము అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో తేలిందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించినట్టు సమాచారం. బూత్‌ కమిటీల పనితీరు లోతుగా సమీక్షించి, అవి ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి లోపాలు, లోటుపాట్లు సరిచేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌బూత్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలను కలిసి బీజేపీ, మోదీపాలనపై మద్దతు కూడగట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేలా చూడాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా పర్యటించేందుకు కార్లు, ఇతర వాహనాలపై ఆధారపడకుండా, ప్రతీరోజు బైక్‌లకు జెండాలు కట్టుకుని ఊరూరా తిరగాలని పిలుపునిచ్చారు. తమ పోలింగ్‌బూత్‌ల పరిధిలో ఇదేవిధంగా పనిచేస్తున్నామని చెప్పారు. వెంటనే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో 50 మందితో ఒక్కో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాను ఓ కాన్ఫరెన్స్‌కాల్‌తోనే మూడులక్షల మందితో సంభాషించి, పోలింగ్‌బూత్‌ కమిటీలకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీ నేతలకు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓ స్టార్‌హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్‌ ప్రభారీలు, కన్వీనర్లు, పార్లమెంట్‌ పొలిటికల్‌ ఇన్‌చార్జ్‌లతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో చేపట్టాల్సిన కార్యాచరణ, సిద్ధం చేసుకోవాల్సిన వ్యూహాలపై రాష్ట్రనాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీనేతలు డా.కె.లక్ష్మణ్, డీకే.అరుణ, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ  రాబోయే రెండునెలలు అన్ని పనులను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేయాలని చెప్పారు. పార్టీనేతలు మరింత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే 12 సీట్లే కాదు 15 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశా లున్నాయని తెలిపారు.  ఇదేస్థాయిలో పనిచేస్తే 2029లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చితీరుతుందని నాయకులకు అమిత్‌షా స్పష్టం చేశారు.

అమిత్‌షాతో అరూరి రమేశ్‌ భేటీ 
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అమిత్‌షాతో భేటీ అయ్యారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరి, వరంగల్‌ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముందుగా రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాలను కలిసి చేరిక తేదీపై నిర్ణయం తీసుకోవాలని అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. త్వరలోనే రమేశ్‌ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆయనకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాల సమాచారం. వరంగల్‌ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఓ స్టార్‌ హోటల్‌లో అమిత్‌షాను కలిసినట్టు సమాచారం.

Advertisement
Advertisement