ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్‌లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్ పేర్లను చెప్పారు.
ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్‌క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్‌లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్‌గా నిలిచింది.
ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్‌క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్‌లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్‌గానూ రాణించాడు.
గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.
ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే.
కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్‌లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment