మరో ఏడుగురికి బీజేపీ టికెట్లు! | Sakshi
Sakshi News home page

మరో ఏడుగురికి బీజేపీ టికెట్లు!

Published Fri, Nov 10 2023 4:29 AM

BJP has finalized seven candidates for Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. బీజేపీ నాయకత్వం ఆయా అభ్యర్థులకు ఫోన్లు చేసి పార్టీ తరఫున నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో ఇప్పటివరకు 106 మందిని ప్రకటించినట్టు అయింది. మరో ఐదు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగతా 8 స్థానాలను పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు కేటాయించారు. 

కీలక స్థానాలకు ఎంపిక 
శేరిలింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. నిజానికి ఈ సీటుకోసం జనసేన ప్రయత్నం చేసింది. కానీ తనకు సంబంధించిన చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని కీలకమైన సీటు కావడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి  రవికుమార్‌ యాదవ్‌కు ఇప్పించుకున్నారు. ఇక మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు.. పెద్దపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు టికెట్లు ఇచ్చారు.

సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, నాంపల్లి నుంచి రాహుల్‌చంద్ర, కంటోన్మెంట్‌ నుంచి రిటైర్డ్‌ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌ల పేర్లు ఖరారైనట్టు తెలిసింది. ఇంకా నర్సంపేట, మధిర, అలంపూర్, దేవరకద్ర, చాంద్రాయణగుట్ట సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట అభ్యరి్థగా సత్యనారాయణ ముదిరాజ్‌ పేరును ఇంతకుముందే ప్రకటించినా.. అనారోగ్య కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ కావడంతో.. ఈ ఐదు సీట్లకు వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. 

నేడు నామినేషన్లు.. ప్రచార సభల్లో కేంద్రమంత్రులు 
శుక్రవారం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార సభల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. వరంగల్‌లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, చేవెళ్లలో బీఎల్‌ఎన్‌ వర్మ, కొల్లాపూర్‌లో పురుషోత్తం రూపాలా తదితరులు పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 27 వరకు జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ తెలిపారు.  

టికెట్‌ ఖరారు సమాచారం అందిన నేతలు 
నియోజకవర్గం    అభ్యర్థి 
1.మల్కాజిగిరి    రాంచందర్‌రావు 
2.మేడ్చల్‌        విక్రమ్‌రెడ్డి 
3.పెద్దపల్లి        దుగ్యాల ప్రదీప్‌రావు 
4.శేరిలింగంపల్లి    రవికుమార్‌ యాదవ్‌ 
5.నాంపల్లి        రాహుల్‌ చంద్ర 
6.కంటోన్మెంట్‌    కృష్ణప్రసాద్‌ 
7.సంగారెడ్డి        పులి మామిడి రాజు  

Advertisement
Advertisement