నిజ్జర్‌ కేసులో అరెస్ట్‌.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్‌ | Sakshi
Sakshi News home page

నిజ్జర్‌ కేసులో అరెస్ట్‌.. నిందితుల గురించి సంచలన విషయాలు..

Published Sun, May 5 2024 7:55 AM

Jaishankar Reacts Over Canada Arresting Indians In Nijjar Case

ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

కాగా, హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో నిందితులు కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్‌పై జయశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. 

భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్‌ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్‌ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది.

Advertisement
 
Advertisement