సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర: ఈడీ ఆరోపణలపై ఆప్‌ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ మామిడిపండ్లు, స్వీట్స్‌ తింటున్నారు.. ఈడీ ఆరోపణలపై ఆప్‌ మండిపాటు

Published Thu, Apr 18 2024 7:56 PM

Conspiracy to kill Arvind Kejriwal in jail insulin Denied: AAP big charge - Sakshi

న్యూఢిల్లీ:  ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బెయిల్‌ కోసం కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు వంటి తియ్యటి పదార్ధాలు తింటున్నారంటూ ఈడీ చేసిన ఆరోపణలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఈడీ తప్పులు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది.. సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపడానికి కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి టైప్ 2 డయాబెటిస్‌ పేషెంట్‌ అని.. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఇన్సులిన్ ఇవ్వడం లేదని విమర్శించారు.

‘సీఎం కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్తుడని అందరికీ తెలుసు.. అతను గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తన షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటాడు. ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్నవారు మాత్రమే ఇంత ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. అందుకే కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి అనుమతించింది.

కానీ బీజేపీ తన జేబు సంస్ధ ఈడీ సాయంతో అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆయ‌న‌కు ఇంటి నుంచి ఆహారం అంద‌కుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కేజ్రీవాల్ స్వీట్ టీ తాగుతున్నారని, స్వీట్లు తింటున్నారని ఈడీ చెప్పడం పూర్తి అబద్ధం.. కేజ్రీవాల్‌జీకి డాక్టర్ సూచించిన స్వీటెనర్‌తో టీ,స్వీట్‌లకు అనుమతి ఉంది. ఇది డయాబెటిక్ రోగులకు ఇవ్వబడే తక్కువ కేలరీల స్వీటెనర్.

కేజ్రీవాల్ తన బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుకోవడానికి అరటిపండ్లు తింటున్నాడన్న ఈడీ ఆరోపణలు అతిషి తప్పుబట్టారు. ‘నేను ఈడీకి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మధుమేహ వైద్యుడితో మాట్లాడండి. రోగులకు అరటిపండు, కొన్ని రకాల టోఫీ లేదా చాక్లెట్ ఎల్లప్పుడూ వారితో  ఉంచుకోమని చెబుతారు. కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు లేదా జైలులో ఉన్నప్పుడు అతను ఎప్పుడూ ఏదో ఒక రకమైన టోఫీ, అరటిపండు అతనితో కలిగి ఉండాలని కోర్టు ఉత్తర్వులో స్పష్టంగా రాసి  ఉంది’ అని తెలిపారు. 

చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. దిల్లీ సీఎం అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు ఇంటి భోజనానికి అనుమతి ఉండటంతో ఆయన నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని తెలిపింది.

ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్‌ పెరుగుతాయని ఆయనకు తెలిసే.. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ను వైద్యులు చెక్‌ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్‌పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement