Sakshi News home page

Savitri Jindal: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన సావిత్రి జిందాల్‌!

Published Thu, Mar 28 2024 11:26 AM

Former Haryana Minister Savitri Jindal Resigns Congress - Sakshi

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరగా, ఇప్పుడు అతని తల్లి సావిత్రి జిందాల్ కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. 

బీజేపీలో చేరిన నవీన్‌ జిందాల్‌ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందారు. తాజాగా ఆమె తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84. జిందాల్ గ్రూప్ వ్యాపార వ్యవహారాలను ఆమె  నిర్వహిస్తున్నారు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024, మార్చి 28 నాటికి సావిత్రి జిందాల్ నికర ఆస్తుల విలువ $29.6 బిలియన్లు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ హిసార్ నియోజకవర్గం  నుంచి ఎమ్మెల్యేగా  ఎన్నికై పదేళ్లు హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 

సావిత్రి జిందాల్  భర్త, జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓపీ జిందాల్ 2005లో విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆమె వ్యాపార బాధ్యతలు చేపట్టారు. తరువాత హిసార్ నియోజకవర్గం నుండి హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సావిత్రి జిందాల్ ఓటమిని చవిచూశారు. తాజాగా ఆమె కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.

 

Advertisement

What’s your opinion

Advertisement