లావుకు చుక్కలు చూపిస్తున్నారు! | Sakshi
Sakshi News home page

లావుకు చుక్కలు చూపిస్తున్నారు!

Published Fri, Apr 26 2024 9:01 PM

Lavu Sri Krishna Devarayalu Is Suffering For Joining TDP

చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక  వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా  కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ  కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి  కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్‌కు బేరం పెట్టారు.

తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్‌సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని  లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.

నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని  పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును  మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని  అన్నారట. పెదకూర పాడు సీటును  కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.

లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్‌లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న  లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్  శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.

ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా  లావుపై  ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై  జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement