SPSR Nellore: ఓటమి భయం.. వేమిరెడ్డి దంపతుల అడ్డదారులు | Sakshi
Sakshi News home page

SPSR Nellore: ఓటమి భయం.. వేమిరెడ్డి దంపతుల అడ్డదారులు

Published Thu, Apr 4 2024 1:28 PM

Nellore Lok Sabha Kovuru TDP candidates Bribing Voters with notes - Sakshi

తమవైపు తిప్పుకొనేందుకు వేమిరెడ్డి ఎత్తుగడ 


 తన టీమ్‌ను రంగంలోకి దింపిన వైనం 


 సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.15 లక్షలు 


 ఎంపీపీ, జెడ్పీటీసీలకు రూ.25 లక్షలు  

ఓటమి తప్పదనే సంకేతాల తరుణంలో టీడీపీ నెల్లూరు లోక్‌సభ, కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు అడ్డదారులు తొక్కుతున్నారు. కోవూరు నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించిన వీరు నోట్లతో ఓట్ల కొనుగోలుకు సన్నద్ధమయ్యారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నగదును ఎర వేసి ఈ వికృత పర్వానికి తెరలేపారు. మత్స్యకార గ్రామాల్లో దురాయి దురాచారాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కొనుగోలుకు రూ.80 లక్షలతో బేరం పెట్టిన అంశం వెలుగులోకి రావడం.. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో ప్రజాప్రతినిధులపై వీరు తాజాగా దృష్టి సారించారు. 

కోవూరు: ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విలువల్లేని రాజకీయాలకు వేమిరెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారు. ఓటమి భయంతో నేతలకు వీరు రేట్లు ఫిక్స్‌ చేసి తమ వైపునకు తిప్పుకొనే దుస్సాహసానికి తెరలేపారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను తమ శిబిరాలకు రహస్యంగా ఆహ్వానించి ఈ రకమైన మంతనాలకు శ్రీకారం చుట్టారు. 

ప్యాకేజీలు ఖరారు.. 
ఆయా గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీలను ఫిక్స్‌ చేశారని స్థానిక నేతలే పేర్కొంటున్నారు. ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ వారికి ఈ మొత్తాలను ఎర వేస్తున్నారు. ఓటర్లకు సైతం భారీగానే ముట్టజెప్తామని, ఈ నగదు పంపిణీ బాధ్యతా మీదేనంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది.  

బంధుగణంతో టీమ్‌ ఏర్పాటు 
ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సదరు టీమే ఈ వ్యవహారాలను ముందుండి నడిపిస్తోంది. ప్యాకేజీ ఆశ చూపి కొందర్ని ఇప్పటికే తమ శిబిరంలో చేర్చుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఓటర్లు భగ్గుమంటున్నారు. రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఓటేయాలని ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు చెప్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో తమకు అండగా ఉండి.. సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కాకుండా మరెవరికీ ఓటేయబోమని వారు తెగేసి చెప్తున్నారు.  

అధికార యంత్రాంగం నిఘా 
స్వేచ్ఛాయుత పోలింగ్‌పై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్‌ జిల్లా స్థాయిలో నిఘా ఉంచింది. మత్స్యకార గ్రామంలో దురాయి పేరిట ఓట్లు కొనుగోలు చేస్తున్న సమాచారం నిఘా వర్గాల ద్వారా అధికారులకు అందింది. దీనిపై ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement