రూ. 2,458 కోట్ల విలువైన వాటా జారీ
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్‌సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్‌వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్‌పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది.
తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్‌సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్‌సన్‌కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్‌లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment