కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?  | Sakshi
Sakshi News home page

కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా? 

Published Fri, Apr 19 2024 9:22 AM

Sensational Verdict Of Kadapa Court On Ys Viveka Assassination Case - Sakshi

వివేకా హత్య మీద మాట్లాడొద్దని కోర్టు ఆదేశం 

అది కూడా లేకుంటే ఇక వాళ్లకు ప్రచారాంశమే లేనట్లే 

ఇప్పటికే సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్

వివేకా హత్య మీదనే ఎన్నికలకు వెళ్తామనుకుంటే..

రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్‌ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు.

గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి  పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.  దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే  ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు.

ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు  బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆయన పిటిషన్ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్‌ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి..
-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement