పచ్చపార్టీ ప్రలోభాలు | Sakshi
Sakshi News home page

పచ్చపార్టీ ప్రలోభాలు

Published Thu, Apr 25 2024 3:10 PM

TDP is violating the Election Code - Sakshi

ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు  

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం 

ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్‌ బాక్సులు పంపిణీ 

పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్‌లు  

సాక్షి, చిత్తూరు/చిత్తూరు అర్బన్‌/చిత్తూరు కార్పొరేషన్‌/గిద్దలూరు రూరల్‌: ఎన్నికలు  సమీపి­స్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడు­తోంది. దీంతో ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఓవైపు మనీ.. ఇంకోవైపు మద్యం పంపిణీ చేస్తూ యథే­చ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ముందుగానే ఓటమి ఖాయం కావడంతో కాస్తయినా పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నగదు, గిఫ్ట్‌ బాక్సులు పంపిణీ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చాలా సులువుగా అక్కడి మద్యాన్ని సరిహద్దులు దాటిస్తూ డంప్‌ చేస్తున్నారు. బుధవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గురజాల జగన్మోహన్, ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా ర్యాలీకు వచ్చినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు, పెద్ద ఎత్తున మద్యం అందజేశారు. పలమనేరు నీటిపారుదల శాఖలో జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి ‘పచ్చ’ జెండాలు మోస్తూ ఇప్పటికే సస్పెండ్‌ అయ్యాడు. అయితే మళ్లీ తాజాగా చిత్తూరు రూరల్‌ మండలంలో జనసమీకరణ చేసి టీడీపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.

ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు ద్విచక్ర వాహనాలు
ప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు రూ.లక్షలు విలువ చేసే బుల్లెట్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల పంపిణీకి టీడీపీ అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో పాల వ్యాపారం చేసే వారికి ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉచితంగా ఇచ్చారు. వాటికి టీడీపీ స్టిక్కర్లు అంటించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇవిగో ప్రలోభాలు..
చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ లక్ష్మీపురం, ముత్తుకూరుల్లో ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కర్ణాటక మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు రూ.80 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఇటీవల చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రూరల్‌ మండలంలో పిల్లలకు పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. 
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో షాదీమహల్‌ వద్ద రంజాన్‌ పర్వదినం ముందు రోజు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌ తరఫున ముస్లింలకు టీడీపీ గుర్తులతో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
   గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్‌ తా­యి­లాల పంపిణీలో స్పీడ్‌ పెంచారు. రెండు రోజుల ముందు శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో నిత్యావ­స­ర వస్తువులతోపాటు చీర, జాకెట్, ప్యాంటు, చొక్కా, మ­ద్యం బాటిల్, రూ.500 నగదు కిట్‌గా పంపిణీ చేశారు. 
నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ క్వారీల రాజకీయానికి తెరతీశారు. తమ పార్టీలోకి వస్తే క్వారీలు ఇస్తామని నమ్మబలుకు­తున్నారు. మరికొందరికి డీకేటీ భూములు కూడా ఇస్తామని అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇక పుంగ­నూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. 
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ తాయిలాలు ఊపందుకున్నాయి. ఇటీవల చంద్ర­బాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని 243 పోలింగ్‌బూత్‌ల్లో ఒక్కో చోట రూ.30 వేల చొప్పున పంపిణీ చేశారు. అలాగే జనసమీ కరణ కోసం ఒక్కొక్కరికి రూ.300 నగదు, మద్యం సీసా, బిర్యానీ అందజేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి నామినేషన్‌ పర్వంలో ఓటులేని వారి చేతికి టీడీపీ జెండా ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి నామినేషన్‌కు నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి జనాన్ని తరలించారు. నామినేషన్‌ సందర్భంగా మద్యం ఏరులై పారింది. 

Advertisement
Advertisement