IPL 2024: పంత్‌కు భారీ జరిమానా.. ఈసారి ఆటగాళ్లందరికీ కూడా | Sakshi
Sakshi News home page

IPL 2024: పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా.. ఈసారి జట్టుకు కూడా

Published Thu, Apr 4 2024 8:37 AM

BCCI Punishes Pant Entire DC With Heavy Fine Code of Conduct Breach Vs KKR - Sakshi

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) చేతిలో ఘోర ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌తో పాటు ఈసారి జట్టు మొత్తానికి భారీ జరిమానా పడింది.

కాగా విశాఖపట్నం వేదికగా ఢిల్లీ బుధవారం కేకేఆర్‌తో తలపడింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా జట్టు పరుగుల సంద్రంతో మైదానాన్ని ముంచెత్తింది. సునిల్‌ నరైన్‌(39 బంతుల్లో 85), అంగ్‌క్రిష్‌ రఘువంశీ(27 బంతుల్లో 54), ఆండ్రీ రసెల్‌(19 బంతుల్లో 41) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 272 పరుగులు సాధించింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తమకు రెండో హోంగ్రౌండ్‌ అయిన విశాఖలో ప్రత్యర్థి ముందు తలవంచింది. టాపార్డర్‌ పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(25 బంతుల్లో 55), ట్రిస్టన్‌ స్టబ్స్‌(32 బంతుల్లో 54) కాసేపు మెరుపులు మెరిపించారు.

అయినా.. కేకేఆర్‌ బౌలర్ల ధాటికి నిలవలేక లోయర్‌ ఆర్డర్‌ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంలో 17.2 ఓవర్లలో 166 రన్స్‌ చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఏకంగా 106 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

స్లో ఓవర్‌ రేటు
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున భారత క్రికెట్‌ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

‘‘టాటా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంల.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఏప్రిల్‌ 3న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసింది.

కావున ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌తో పాటు అతడి జట్టుకు కూడా జరిమానా విధిస్తున్నాం’’ అని బీసీసీఐ పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇదే తప్పు చేసింది.

రెండో తప్పు కాబట్టి..
ఫలితంగా మొదటి తప్పిదం కావున అప్పుడు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షల ఫైన్‌ వేశారు. అయితే, ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం రెండోసారి ఇదే తప్పు చేసినందున ఈసారి భారీ జరిమానా విధించారు.

కెప్టెన్‌ పంత్‌కు రూ. 24 లక్షలు, కేకేఆర్‌తో మ్యాచ్‌లో తుదిజట్టులోని ఢిల్లీ ఆటగాళ్లందరూ.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అభిషేక్‌ పోరెల్‌తో సహా ఒక్కొక్కరికి రూ. 6 లక్షల జరిమానా లేదంటే.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం(ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది) కోత విధిస్తారు.

Advertisement
Advertisement