World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్‌ | CWC 2023 Warm Up Match PAK VS NZ: Mohammad Rizwan Slams Century, Babar Azam Scored 80 Runs - Sakshi
Sakshi News home page

World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్‌

Published Fri, Sep 29 2023 5:54 PM

CWC 2023 Warm Up Match PAK VS NZ: Mohammad Rizwan Slams Century - Sakshi

పాక్‌ స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా   న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వాన్‌ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్‌ అయ్యాడు. రిజ్వాన్‌తో పాటు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా రాణించాడు.

బాబర్‌ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్‌లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 257/4గా ఉంది. సౌద్‌ షకీల్‌ (36), అఘా సల్మాన్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్‌ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. 

మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు.

బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ 3, సకీబ్‌, షొరీఫుల్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్‌ టాస్‌ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement