CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్‌.. ఆసీస్‌ హీరోకు నో ఛాన్స్‌ | Sakshi
Sakshi News home page

CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్‌.. ఆసీస్‌ హీరోకు నో ఛాన్స్‌

Published Mon, Nov 20 2023 3:44 PM

ICC announces team of World Cup 2023 - Sakshi

45 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్‌-2023కు ఎండ్‌ కార్డ్‌ పడింది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. వరల్డ్‌కప్‌-2023 ఛాంపియన్స్‌గా ఆస్ట్రేలియా నిలవగా.. టీమిండియా రన్నరప్‌గా నిలిచింది.  ఫైనల్‌ పోరులో ఆసాధరణ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన భారత జట్టు ఆఖరి పోరులో మాత్రం తేలిపోయింది.

ఇక ఇది ఇలా ఉండగా..  వరల్డ్‌కప్‌ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్‌తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఉన్నారు.

ఇక వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా.. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్‌ డికాక్‌, న్యూజిలాండ్‌ నుంచి డార్లీ మిచెల్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ దిల్షాన్ మదుషంకకు చోటు దక్కింది.  అదే విధంగా 12వ ఆటగాడిగా సౌతాఫ్రికాకు చెందిన కోయెట్జీని ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఐసీసీ ఎంపిక చేసిన ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ఈ మెగా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే ఈ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌, ఫైనల్లో అదరగొట్టిన ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

ఐసీసీ బెస్ట్‌ ఎలెవన్: క్వింటన్ డికార్ (సౌతాఫ్రికా), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డారెల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుషంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ. 12వ ఆటగాడిగా కోయెట్జీ.

Advertisement
Advertisement