సాక్షి, కృష్ణా: బీసీ వర్గాలను ఆదరించడంలో ముఖ్యమంత్రి ఎప్పుడూ ముందే ఉంటారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం ఒకటి అని నాని చెప్పుకొచ్చారు.
కాగా, గుడివాడలో యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల, జనరల్ స్థానాల్లో మేయర్లుగా జడ్పీ చైర్మన్‌లుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. యాదవులను గుడివాడ మున్సిపల్ చైర్మన్‌గా చేస్తాం. గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని రెండు ఎకరాల స్థలాన్ని యాదవ కళ్యాణ మండపానికి కేటాయించాలని మున్సిపాలిటీలో తీర్మానం చేయించాం.
గుడివాడ నియోజకవర్గంలో ఏ కులానికి లేని విధంగా యాదవులకు అద్భుతమైన కళ్యాణ మండపం నిర్మితమవడంలో నా సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తాను. రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. గుడివాడలో యాదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాం.
ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో యాదవ సోదర సోదరీమణులందరూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని యాదవులకు సముచిత స్థానం కల్పించారు. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం కూడా ఒకటి.
గుడివాడ నియోజకవర్గంలోని యాదవ సోదరులతో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాదవ సోదరులు ముందుకు వస్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా సంఘం అభివృద్ధికి దోహద పడినవారు అవుతారు. అవకాశం ఉన్నచోట మీ పిల్లలను రాజకీయంగా ప్రోత్సహించండి. సీఎం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో నాలాంటి వారికి పెద్దగా అవకాశం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారు. నాకు, పేర్ని నానికు మంత్రి పదవులు ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా, విశ్వాసంతో సీఎం జగన్ వెంటే ఉంటాం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment