గుడ్లవల్లేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా బీసీలను అణగదొక్కారని, ఇప్పుడు వారిపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శుక్రవారం పైపులైన్ల పనులను ప్రారంభించేందుకు వచ్చిన నాని మీడియాతో మాట్లాడారు.
అత్యధిక శాతం ఉన్న బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చంద్రబాబు ఇప్పటికీ చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ను భుజాన వేసుకుని బాబు బీసీలను గాలికొదిలేశాడన్నారు. ఏ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాడో బాబుకు ఆయా వర్గాలు తప్పకుండా 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతాయన్నారు. బాబు అధికారంలో ఉండగా రాజకీయంగా గానీ, సంక్షేమపరంగా గానీ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్ బీసీలకు చేసిన సంక్షేమాన్ని తన ఖాతాలో వేసుకుని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
బాబు హయాంలో కమ్మ, జగన్ హయాంలో బీసీ
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా జిల్లాలో బీసీ అయిన కొలుసు పార్థసారథికే మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తాను, పేర్ని నాని జిల్లా మంత్రుల అనంతరం బీసీ సామాజిక వర్గం నుంచి జోగి రమేష్ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఓసీ రిజర్వేషన్ అయితే.. చంద్రబాబు ఆనాడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె అనురాధకు అవకాశం ఇచ్చారని, జిల్లాకు ఓసీ రిజర్వేషన్ వచ్చినా బీసీ అయిన ఉప్పాల హారికను మహిళా చైర్‌పర్సన్‌గా చేయడం బీసీల పట్ల జగన్‌కు ఉన్న అంకిత భావానికి నిదర్శనమన్నారు. విజయవాడ మేయర్ ఓసీ రిజర్వేషన్ వస్తే కమ్మ సామాజిక వర్గం నుంచి కోనేరు శ్రీధర్‌ను చంద్రబాబు పెడితే, ఇప్పుడు మాత్రం ఓసీ రిజర్వేషన్ అయినా బీసీ మహిళను మేయర్‌ను చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment