IND Vs IRE: Sussex Rope In Jaydev Unadkat For Brief County Stint - Sakshi
Sakshi News home page

కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్‌.. పుజారాతో పాటు..!

Published Thu, Aug 17 2023 7:52 PM

Sussex Rope In Jaydev Unadkat For Brief County Stint - Sakshi

విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్‌  కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్‌.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్‌లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్‌లో ఉనద్కత్‌ ససెక్స్‌ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్‌ దక్కింది.

భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగిన ఉనద్కత్‌.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్‌ రికార్డు చూసే ససెక్స్‌ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం.

ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్‌ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్‌ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్‌ గ్రూప్‌-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది.

అయితే ఈ టోర్నీలో ససెక్స్‌ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్‌ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్‌ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement