ఇషాన్‌, శ్రేయస్‌ల కాంట్రాక్ట్‌ రద్దు: సచిన్‌ రియాక్షన్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: ఇషాన్‌, శ్రేయస్‌ల కాంట్రాక్ట్‌ రద్దు.. నేనైతే అంటూ సచిన్‌ పోస్ట్‌ వైరల్‌

Published Wed, Mar 6 2024 10:33 AM

Tendulkar Intriguing Ranji Trophy Remark Amid Ishan Shreyas Iyer Contract Saga - Sakshi

దేశవాళీ క్రికెట్‌ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్‌ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు.

తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్‌ టెండుల్కర్‌ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ క్రికెటర్లు కచ్చితంగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌(ఫస్ట్‌క్లాస్‌) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే.

ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్‌కోచ్‌, కెప్టెన్‌, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్‌ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది.

ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌ ఎక్స్‌ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్‌కు దూసుకువచ్చింది.

మరో సెమీస్‌ మ్యాచ్‌లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి.

నిజానికి నా కెరీర్‌ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్‌ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్‌ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది.

టీమిండియా తరఫున టాప్‌ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్‌లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

అంతేకాదు ఫామ్‌లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్‌ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్‌ క్రికెటర్లు డొమెస్టిక్‌ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు.

నిజంగా దేశవాళీ క్రికెట్‌కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేశాడు. కాగా సచిన్‌ టెండుల్కర్‌ మంగళవారం ఈ మేరకు పోస్ట్‌ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్‌లో మధ్యప్రదేశ్‌పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

Advertisement
Advertisement