‘పొత్తు గురించి చంద్రబాబు చెప్పాలి గానీ, ప్యాకేజీ స్టార్‌ చెప్పేదేంటి?’ | Sakshi
Sakshi News home page

‘పొత్తు గురించి చంద్రబాబు చెప్పాలి గానీ, ప్యాకేజీ స్టార్‌ చెప్పేదేంటి?’

Published Tue, Oct 17 2023 1:40 AM

- - Sakshi

టీడీపీతో పొత్తు ఉంటుందంటూ ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రకటన.. ఇప్పుడు టీడీపీని కలవరపాటుకు  గురిచేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న టీడీపీ నేతలు పోటీ చేసేందుకు జంకుతున్నారు. పొత్తులో నిజంగా జనసేనకు టికెట్‌ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. అందువల్లే చాలా మంది టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో కేడర్‌ను కాపాడుకునే క్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కులాల వారీగా పదవులు కట్టబెడతామని ఆశ చూపుతూ బీసీ, ఎస్సీ కులాల వారితో హడావుడి చేయిస్తున్నారు. అసలు పొత్తు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయకుండా, ఇలా పవన్‌ కళ్యాణ్‌  ప్రకటన చేయడం ఏంటనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. 

సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలంతా నీరుగారిపోయారు. పార్టీ పనైపోయిందంటూ అంతర్గతంగా కుమిలిపోతున్నారు. నడిపించే నాయకుడు లేక తలోదారి చూసుకుంటున్నారు. ఈ తరుణంలో కొందరు టీడీపీ నేతలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, నిరసనలు చేయిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో నాలుగైదు చోట్ల వెలుగు చూశాయి. ధర్నాల్లో పాల్గొంటే పార్టీలో పదవులు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కేసులు మోసుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశచూపి ప్రేరేపిస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు కు(టి)ల రాజకీయాలు చేస్తున్నారు.

పదవుల పేరుతో ఆశచూపి..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల టీడీపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైంది. దీంతో ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డారు. ధర్నాలు చేయండి.. దీక్షల్లో పాల్గొనండి.. పోలీసులపై తిరగబడండి...రానున్న రోజుల్లో పే...ద్ద పదవులు వస్తాయి. ముందుకు రండి’అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు. కానీ ఇన్నాళ్లూ అంతా తామే...అన్నీ తామే అంటూ పెత్తనం చేసిన నేతలు ఇప్పుడు ఇలా ‘బాబ్బాబు’ అంటూ అడుక్కుంటున్నా... కేడర్‌ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మీ పార్టీలో పోస్టులొద్దు... మీరూ వద్దూ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కొందరికి డబ్బు, మద్యం ఎరగా వేసి ప్రేరేపిస్తున్నారు. పార్టీ కమిటీలోనూ ఉన్నత పదవులిస్తామంటూ చిన్నస్థాయి కార్యకర్తలకు ఆఫర్లు ఇస్తున్నారు.

సీటు గ్యారెంటీ లేక...
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. టీడీపీ సీనియర్‌ నేతలంతా పక్కన విధేయులుగా నిలబడగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఎదుట పవన్‌ చేసిన ఈ ప్రకటనను ‘తమ్ముళ్లు’ జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు గురించి తమ నాయకుడు చెప్పాలి గానీ, ఈ సినిమా యాక్టర్‌ చెప్పేదేందంటూ రగిలిపోతున్నారు. మరోవైపు ఇక టీడీపీని కూడా తామే నడిపిస్తామని జనసైనికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు కూడా పొత్తులో తమకే వస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement