Another Vande Bharat Express From Hyderabad; Check Details Here - Sakshi
Sakshi News home page

మరో వందేభారత్‌ వచ్చేసింది.. కాచిగూడ నుంచి ఈ నెలలోనే ప్రారంభం

Published Tue, Aug 1 2023 5:36 PM

Another Vande Bharat Express from Hyderabad Check Details Here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం నుంచి మరో వందేభారత్‌ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖ, తిరుపతిల నడుమ సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ రైళ్లు నడుస్తున్న సంతి తెలిసిందే. ఇప్పుడు మూడో రూట్‌లో ఉరుకులు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెన్నై ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి సోమవారమే రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 

దేశంలోనే ఐటీ  దిగ్గజ నగరాలుగా పేరొందిన  హైదరాబాద్‌–బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. కాచిగూడ–యశ్వంతపూర్‌ (బెంగళూరు) స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్‌ రైలు పరుగుపెట్టనుంది. దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందేభారత్‌ సర్వీసుగా అందుబాటులోకి రానున్న ఈ రైలు సేవలు ఆగస్టు 6న లేదా 15వ తేదీన లేదంటే ఆ తేదీల మధ్యలో గానీ  ప్రారంభం కానున్నాయి.

ఎనిమిదిన్నర గంటల్లో..
ప్రస్తుతం నగరం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్‌ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది. కాచిగూడలో ఉదయం ఆరుగంటల సమయంలో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగుళూరు చేరుకుని, తిరిగి అక్కడ 3 గంటలకు బయలు దేరి రాత్రి పదకొండున్నర వరకు కాచిగూడకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రారంభ తేదీని.. సమయాలను మాత్రం ఇంకా రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement
Advertisement