లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే. ఎందుకంటే ప్రధాని మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో స్టాండప్ కమెడియన్ 'శ్యామ్ రంగీలా' ప్రధాని మోదీపై పోటీ చేయాలనీ ప్రయత్నించారు. అయితే అతని నామినేషన్
నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురైంది. దీంతో మోదీ పోటీ చేస్తున్న వారణాసి బరిలో దిగాలనుకున్న శ్యామ్ రంగీలా ఎవరనేది ప్రశ్నగా మారిపోయింది.. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూసెయ్యండి.
రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో.. ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల తరువాత నామినేషన్ల గడువు ముగియడానికి రెండు నిమిషాల ముందు.. అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు.
మరుసటిరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని శ్యామ్ రంగీలా ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి మే 14న ప్రధాని మోదీ
నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోజార్టీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజార్టీ 5లక్షలు దాటి పోతుందని ధీమా వ్యక్తంచేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీచేసినంత మాత్రాన.. మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివితక్కువతనమని కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment