టైటిల్: మిరల్
నటీనటులు: భరత్, వాణి భోజన్, కే.ఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
నిర్మాణ సంస్థ: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత: సీహెచ్ సతీష్
దర్శకుడు: ఎం శక్తివేల్
సంగీతం: ప్రసాద్ ఎస్‌ఎన్
సినిమాటోగ్రఫీ:సురేష్ బాలా
ఎడిటర్: కలైవానన్ ఆర్
ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో భరత్. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళ్‌లో 2022లోనే విడుదలై మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత అదేపేరుతో తెలుగులో విడుదల చేశారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(మే 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సివిల్ ఇంజనీరింగ్ హరి(భరత్), రమ(వాణి భోజన్)లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలంలో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడు ఆనంద్ ఫ్యామిలీని కూడా అక్కడకు రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? రమ కలలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హరి ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
హారర్, సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెట్టే విధంగా ఉంటేనే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మిరల్ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. సస్పెన్స్ పేరుతో అసలు కథను దాచి.. అనవసరపు సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగదీశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లను రాసుకున్నాడు కానీ.. అసలు కథని ఆ సీన్లకి ఎలాంటి సంబంధం ఉండదు.
అయితే సెకండాఫ్‌లో అసలు మ్యాటర్ రివీల్ అయిన తర్వాత కథపై ఆసక్తిపెరుగుతంది. ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం.. ఆ తర్వాత మారిపోతుంది. ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాల కథనం సాగుతుంది. అయితే ఈ సస్పెన్స్, థ్రిల్లర్‌కి హారర్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం.. దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్ అనిపించదు. చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సీన్లకు సరైన ముగింపే ఉండదు. ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్. కొన్ని సన్నివేశాల్లో అక్కడ జరుగుతున్న దానికి.. చెప్పే డైలాగ్స్‌కి సంబంధమే ఉండడు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
హరి పాత్రలో భరత్ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుత కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమగా వాణి భోజన్ చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా నటించిన కేఎస్ రవికుమార్.. తనకున్న నటనానుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment