
ఏపీ బీజేపీలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు రాష్ట్రంలోని సీనియర్ నాయకులు ఎందుకు ప్రచారం చేయలేదు? సీనియర్లంతా ప్రచారానికి దూరం కావడానికి కారణం ఏంటి? ఈ విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలి పాత్ర ఏంటి? ఓటింగ్ ముగిసిన తర్వాత పార్టీ నాయకులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? పోలింగ్ తర్వాత ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడటానికి కారణం ఏంటి?
బీజేపీ సీనియర్లు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. సీనియర్ నేతలంతా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం ఆయా సభలలో సీనియర్లు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు.
ఇలా సొంత పార్టీకి చెందిన సీనియర్లే ప్రచారానికి, పోల్ మేనేజ్ మెంట్ కి దూరంగా ఉండటం కూడా రాష్ట్ర బీజేపీని పూర్తిగా ఆత్మ రక్షణలో పడేసింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలని జార విడుచుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు కమలం పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంప ముంచిందంటున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరి పోటీ చేసిన చోట కాకుండా మిగిలిన స్ధానాలలో టీడీపీ నుంచి పూర్తిగా సహకారం కరువైదంటున్నారు. ఇక టీడీపీ నుంచి చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేసిన స్ధానాలలో ఒరిజనల్ బీజేపీ నేతలెవరూ కూడా మనస్పూర్తిగా పనిచేయలేదని, సొంత పార్టీ జెండాను ఇతర పార్టీ నేతలు లాక్కోవడాన్ని జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు.
ఇందుకోసమే కమల నేతల మధ్య అనైక్యతా రాగం, ఇతర పార్టీ నేతలు టిక్కెట్లు తెచ్చుకున్నచోట వారితో కలవలేకపోవడం, ఇవన్నీ పోలింగ్ రోజు తీవ్ర ప్రభావాన్నే చూపాయంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు అబద్దపు అలవికాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత నష్టం చేసిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు.

మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని కనీసం చేతితో పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇన్ చార్జి ఇష్టపడలేదు. అయితే టడీపీతో జతకట్టి బరిలోకి దిగిన తర్వాత ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ప్రకటించడం కూటమి మధ్య ఉన్న విభేదాలని బట్టబయలు చేసిందేగాని..ఎన్నికల సమయంలో ఓట్లని కురిపించలేకపోయిందని నేతలు భావిస్తున్నారు.
దీంతో పాటు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ భయం కూడా బిజెపిని వెన్నాడుతోంది. పోలింగ్‌కు ముందు పోల్ మేనేజ్ మెంట్ విషయంలో బిజెపి చేతులెత్తేయడం కూడా మైనస్‌గా మారిందంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంిపీ స్ధానాలతో పాటు మూడు లేదా నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించిన బీజేపీ పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం అంచనాలకు రాలేకపోతున్నారు.
అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీ ని ఓటమి భయం వెన్నాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా గెలవలేమనే ఆందోళన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నాయకుల్లో ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఫలానా సీట్లలో మేము గెలుస్తున్నామని ధైర్యంగా చెప్పలేకపోయారంటున్నారు. ఓటమి భయంతోనే ఏపీ బీజేపీ నైరాశ్యంతో కూడిన నిశ్శబ్ధం ఆవరించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.