న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్‌లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి.
ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?.
రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది.
బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.
లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది.
అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment