లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆప్ అగ్ర నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎం పదవి నుంచి తొలగిస్తారని పునరుద్ఘాటించారు. ‘అధికారంలోకి వస్తే భారీ కార్యక్రమం ఒకటుంటుందని బీజేపీ చెబుతోంది.
రిజర్వేషన్లను తొలగించడమే ఆ కార్యక్రమం. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. మళ్లీ ఆ పార్టీకే అధికార పగ్గాలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతుంది’అని ఆయన అన్నారు. గురువారం కేజ్రీవాల్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో 75 ఏళ్లు దాటిన ఏ నేతకు కూడా ప్రభుత్వంతోపాటు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని, అటువంటి వారు రిటైర్ కావాల్సిందేనంటూ ప్రధాని మోదీ నిబంధన తెచ్చారు.
ఈ ప్రకారమే ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు కొందరు రిటైరయ్యారు. మరికొందరిని తొలగించడమో, ఎన్నికల్లో టికెట్ నిరాకరించమో జరిగింది. మోదీ ఈ నిబంధన అమలుకు కృషి చేస్తున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు అడ్డుగా ఉంటారనుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌లాల్ ఖట్టర్ వంటి వారి కథను మోదీ ముగింపునకు తెచ్చారని విమర్శించారు. ‘అమిత్ షాకు ఆదిత్యనాథ్ అడ్డుగా ఉన్నారు. బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను సైతం పక్కన బెట్టడం ఖాయం’అని కేజ్రీవాల్ అన్నారు.
చీపురుకు ఓటేస్తే..జైలుకెళ్లాల్సిన పనుండదు
అమృత్‌సర్: తాను మళ్లీ జైలుకు వెళ్లరాదని భావిస్తే ఆప్‌కే ఓటేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. గురువారం ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. చీపురు గుర్తు బటన్‌ను మీరు నొక్కితే నేను మళ్లీ జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేజ్రీవాల్‌కు స్వేచ్ఛా లేక జైలా అనే విషయం ఆలోచించి మీరు బటన్ నొక్కండి. చీపురు గుర్తుపై నొక్కితే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించినట్లేనని గుర్తుంచుకోండి’అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment