న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు.
సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.
సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది.
కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ
సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు.
బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి
దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment