విచారణ సందర్భంగా స్వాతి కంటతడి
బిభవ్‌కు దక్కని బెయిల్
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది.
ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్‌కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు.
ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్‌ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్‌కు బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment