telangana: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీచాన్స్‌ ఎవరికి? | Sakshi
Sakshi News home page

telangana: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీచాన్స్‌ ఎవరికి?

Published Thu, May 18 2023 11:21 AM

Governor Quota MLC: BRS Thinks Give Chance To Ghanta Chakrapani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలిలో రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్‌ వస్తుందనే దానిపై బీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్‌ భేటీలో ఖరారు చేసే అవకాశముంది.

పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్‌ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్‌ హుస్సేన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ హయాంలో రెండుసార్లు, బీఆర్‌ఎస్‌ హయాంలో ఒకసారి.. ఫారూఖ్‌ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి ఒక్కోసారి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. 

ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసినా.. ఆయనపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్‌ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్‌ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా సేవలతోపాటు అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా

Advertisement
Advertisement